iDreamPost
iDreamPost
ఏపీలో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానానికి ఎన్నిక జరగబోతోంది. రెండు రోజుల క్రితమే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్సీపీకే ఖాళీ అయిన మండలి సీటు దక్కబోతోంది. టీడీపీ నుంచి శాసనమండలికి ప్రాతినిధ్యం వహించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ గత జనవరిలో రాజీనామా చేశారు. మండలిలో ప్రభుత్వ బిల్లుల విషయంలో ప్రతిపక్షంగా టీడీపీ తీరుని ఆయన తప్పుబట్టారు. దాంతో తాను టీడీపీని వీడుతూ వైఎస్సార్సీపీలో చేరుందుకు నిర్ణయించుకుని, మండలి స్థానాన్ని వదులుకున్నారు.
అదే సమయంలో శాసనమండలి రద్దు చేయాలని ఇప్పటికే ఏపీ అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి నివేదించడం జరిగిపోయాయి. పార్లమెంట్ సమావేశాలు జరిగితే దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చిలోనే మండలి రద్దుకి కేంద్రం సిద్ధమయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా లాక్ డౌన్ తో అప్పట్లో అది సాధ్యం కాకుండా పోయింది. ఇక వెంటనే కాకపోయినా రాబోయే కొన్ని నెలల్లో ఎప్పుడయినా మండలి రద్దు దాదాపుగా ఖాయంగా చెప్పవచ్చు.
ఇలాంటి సమయంలో ఖాళీ స్థానానికి జరగబోతున్న ఎన్నికల్లో మండలిలో అవకాశం దక్కించుకునే నాయకుడు ఎవరైనా గానీ అదృష్టవంతుడే అని చెప్పాలి. దాదాపుగా ఏపీలో శాసనమండలికి ఇవే చివరి ఎన్నికలుగా మారినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ఆఖరి అవకాశం దక్కించుకున్న వారు దీర్ఘకాలం పదవిలో ఉండే అవకాశం లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ హోదా మాత్రం మిగిలిపోతుంది. దాంతో అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వబోతున్నారోననే చర్చ మొదలయ్యింది.
సామాజిక సమీకరణాల రీత్యా ఎస్సీలకు అవకాశం ఉండవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే జరిగితే ఇప్పటికే వివిధ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలయిన వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఏదో ఒక పదవి కట్టబెడుతున్నట్టుగా ఈసారి రాజోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన బొంతు రాజేశ్వర రావుకి చాన్స్ ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. ఆయనకు తోడుగా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న గోదావరి జిల్లాల నాయకుడు మోషేన్ రాజు పేరు కూడా పరిశీలించవచ్చని భావిస్తున్నారు. ఈ ఇద్దరూ కాకుండా డొక్కా మాణిక్య వరప్రసాద్ కే మరోసారి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కొందరు అంచనా వేస్తున్నారు. జూపూడీ ప్రభాకర్ రావు కూడా ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. దాంతో ఎస్సీలకే కేటాయించాలనే తుది నిర్ణయం తీసుకుంటే అవకాశం ఎవరికీ అనేది ఆసక్తికరం.
ఇక ఇతర వర్గాలలో కూడా పలువురికి జగన్ హామీ ఇచ్చి ఉన్నారు. గత ఎన్నికల్లో అవకాశం కల్పించలేని మర్రి రాజశేఖర్ వంటి సీనియర్లకు కూడా జగన్ ఇచ్చిన మాట ప్రకారం మండలి సీటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎస్సీలకే ఛాన్స్ ఉంటుందా లేక ఇతర వర్గాలకు అవకాశం దక్కుతుందా అన్నది కూడా చర్చనీయాంశమే. ఏదయినా గానీ ఆ ఒక్కడూ మాత్రం చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.