Idream media
Idream media
ఎం.ఎ.షరీఫ్.. ఈ పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్లలో విస్తృతంగా నానుతోంది. మీడియాలో పతాక శీర్షికల్లో వస్తోంది. రాజకీయ పార్టీల నేతలు , రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు.. ఇలా ప్రతి ఒక్కరి నోటా ఈ పేరు వినపడుతోంది. మండలి చైర్మన్‌గా ఉన్న ఎం.ఎ.షరీఫ్ పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ఆయన వార్తల్లో నిలిచారు.
మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు ఏపీ రాజకీయాలలో ఎం.ఎ. షరీఫ్ ఒక సాధారణ వ్యక్తి. ఆయన గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాలలో ఉన్నా ఆ పార్టీలో కూడా పెద్దగా గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో ఆసలు ఎవరీ షరీఫ్ అని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.
1955లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన ఎం.ఎ.షరీఫ్ 1982లో టీడీపీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ప్రారంభంలో నరసాపురం టీడీపీ అధ్యక్షుడుగా పని చేశారు. ఆ తర్వాత 1985–87 మధ్య పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కార్యదర్శిగా పని చేశారు. ఆయన సేవలకు తగిన గుర్తింపునిస్తూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు షరీఫ్‌ను 1987లో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.
చంద్రబాబు చేతికి టీడీపీ వచ్చిన తర్వాత షరీఫ్‌కు మొదట తగిన గుర్తింపు దక్కలేదు. దాదాపు చంద్రబాబు సమకాలికుడైనా, పార్టీలో ఆది నుంచి ఉన్నా.. షరీఫ్‌ను పార్టీ పదవులకే పరిమితం చేశారు. కానీ పార్టీ ఇచ్చిన పనిని చాలా నిబద్దతతో పూర్తిచేయటం, జిల్లాల నుంచి హైదరాబాద్ లోని గండిపేట, హిమాయత్ నగర్ ఆఫీసులకు వచ్చే కార్యకర్తలకు సహకరించటం వంటి పనులతో పార్టీలో మంచిపేరు సంపాదించుకున్నారు.
35 సంవత్సరాల రాజకీయ జీవితంలో షరీఫ్ కు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాలేదు. ఆయన కూడా సొంత ఊరు నర్సాపురంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే పంజా సెంటర్ ,పాత బజార్ ప్రాంతంలోని నాలుగు వార్డులను దాటి బయటి రాజకీయంలో కలగచేసుకోలేదు.
ప్రజారాజ్యం vs టీడీపీ
చిరంజీవి,షరీఫ్ డిగ్రీలో క్లాస్మేట్స్.ఇద్దరు నర్సాపురంలో YN కాలేజ్ లో B.Com చదివారు. ప్రజారాజ్యం ఆవిర్భావం తరువాత చిరంజీవితో ఉన్న స్నేహం రీత్యా షరీఫ్ PRP లో చేరుతారని ప్రచారం జరిగింది కానీ ఆయన టీడీపీ లో కొనసాగారు.
షరీఫ్ గురించి స్థానికులు ఒక మాట చెప్తారు. షరీఫ్ ఏక కాలంలో టీడీపీకి,(ఏ పార్టీలో ఉన్నా) మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి లాయల్ గా ఉంటారని చెప్తారు. ఆ మాట నిజం చేస్తూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలి నర్సాపురంలో మాత్రం PRP తరపున పోటీచేసినా ,కాంగ్రెస్ తరుపున పోటీచేసినా లేక వైసీపీ తరుపున పోటీచేసినా సుబ్బారాయుడు మాత్రం గెలవాలన్నట్లు షరీఫ్ వర్గం పనిచేసింది. నర్సాపురంలో 2009లో 10,000 ఓట్లు, 2012 ఉప ఎన్నికల్లో 8000 ఓట్లు మాత్రమే టీడీపీ కి రావటం ఈ మాటలో కొంత నిజం ఉందని అనిపిస్తుంది.
2012 ఉప ఎన్నికల్లో టీడీపీ తరుపున షరీఫ్ పోటీచేస్తాడని చివరి వరకు ప్రచారం జరిగినా తుదకు చినమిల్లి సత్యనారాయణ పోటీచేశారు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సుబ్బారాయుడు గెలవటం విశేషం.
కలసి వచ్చిన అదృష్టం
నంద్యాల ఉప ఎన్నికల రూపంలో షరీఫ్ కు అదృష్టం కలిసొచ్చింది. ముస్లిం ప్రాబల్యం ఉన్న నంద్యాలలో భూమా నాగి రెడ్డి మరణంతో జరిగిన ప్రతిష్టాత్మక ఉప ఎన్నికల్లో గెలుపు ప్రయత్నంలో భాగంగా ఒక ముస్లిం నేతకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేసాడు. అప్పటి వరకు చంద్రబాబు కేబినెట్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవటం గమనార్హం. సహజంగానే స్థానిక నాయకుడు NMD ఫరూఖ్ కు మంత్రి పదవి వస్తుందని నంద్యాల ఓటర్లు భావించారు కానీ వైసీపీ నుంచి ఫిరాయించిన జలీల్ ఖాన్, చాంద్ బాషా లతో పాటు షరీఫ్ కూడా మంత్రి పదవికి కోసం ప్రయత్నం చేశారు. షరీఫ్ ఆ సందర్భంలో చంద్రబాబును “అల్లా”తో పోల్చటం వివాదాస్పదం అయ్యింది.
నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిన తరువాత ఫరూఖ్ కు మంత్రిపదవి దక్కగా ఫరూఖ్ రాజీనామా చేసిన మండలి చైర్మన్ పదవి షరీఫ్ కు దక్కింది.
35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేని షరీఫ్, మొన్న “రూల్స్ కు వ్యతిరేకం అయినా నా విచక్షణ ప్రకారం” అని చెప్పి రాజధాని వికేంద్రేకరణ బిల్లును సెలెక్ట్ కమిటీ కి పంపటంతో టీడీపీకి “రాజకీయంగా” ఉపయోగపడటం కోసమే అలా చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.. “Boss is my leader” అనే షరీష్ “బాస్” కోసమే విచక్షణాధిరాం ఉపయోగించాడన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు.
షరీష్ వ్యక్తిత్వం గురించి తెలిసిన వారికి రాజకీయంగా ప్రోత్సహించి,
తొలి పదవి ఇచ్చిన ఎన్టీఆర్ ను వదిలి చంద్రబాబు వర్గంలో చేరటం ఆశ్చర్యకరమే.
పదవులు రాకపోయినా.. పార్టీలోనే కొనసాగుతూ రాజకీయాలలో విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన షరీఫ్ ఇప్పుడు విమర్శలపాలవుతున్నారు. దీనికి కారణం ఎవరు..? అని షరీఫ్ అనుచరులు, మిత్రులు ప్రశ్నిస్తున్నారు.