అన్నీ నాకే కావాలంటే కుదరదా..?

కోవిడ్‌ 19 వచ్చాక ఆర్ధిక, సామాజిక స్థాయీ బేధాల్లో తీవ్రమైన మార్పులే వచ్చాయి. వీటిని అనుసరించే వాళ్ళు ఉండనీ ఉండకపోనీ.. కానీ కోవిడ్‌ ముందు అందరూ ఒక్కటేనని ఇప్పటికే అనేకసార్లు తీర్పువచ్చేసింది. సామాన్యుడి నుంచి దేశా«ద్యుక్షుల వరకు కోవిడ్‌కు అతీతులేమీ కాదని తేల్చేసింది. అయితే దీనిని గురించి పట్టించుకోకుండా ఇంకా కొంత మంది అతి తెలిపిని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

తమతమ దేశాల్లోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌లు కావాలని ముందుగానే డబ్బులు పెట్టి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఇది ఆయా దేశాల ఆర్ధిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటోంది. అయితే ఈ వ్యాక్సిన్‌ పోటీలో పేద దేశాల గతేం కాను అని మానవతావాదులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పలు అగ్రదేశాలు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించేయడానికి కూడా సిద్దపడిపోయాయి. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళి అందరికీ వ్యాక్సిన్‌ సక్రమంగా అందుతుందా? లేదా? అన్న సందేహాలు పుట్టుకొచ్చాయి.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ మాటలను బట్టి కరోనా వ్యాక్సిన్‌ విషయంలో అగ్రరాజ్య స్థాయీ బేధాలు పనిచేయవని తేల్చేసారు. అన్నీ మా దేశానికే కావాలని తీసుకు వెళ్ళి వినియోగించుకున్నప్పటికీ కోవిడ్‌ను అరికట్టడం సాధ్యం కాదని, అలా వ్యాక్సిన్‌ తీసుకున్న దేశాల వారికి కోవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోతుందన్న గ్యారెంటీలు ఏమీ లేవన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన సమూహాలకు టీకాను ఇవ్వడం ద్వారా మాత్రమే కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని ఆయన తేల్చేసారు డబ్బున్న దేశాలో ఏకఛత్రాధిపత్యంగా వ్యాక్సిన్‌ను సొంతం చేసేసుకుని వినియోగించుకున్నంత మాత్రాన కోవిడ్‌ సమసిపోదన్నది ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంతర్లీనంగా తెలియవస్తోంది.

వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు తరచు ప్రయాణించాల్సిన పరిస్థితులు ఇప్పటి ఆధునిక ప్రపంచం ముందు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ధికంగా కలిగిన దేశాలు మాత్రమే వ్యాక్సిన్‌ను వినియోగించుకుంటే, ఆయా దేశాల ప్రజలు ఇతర దేశాలకు ప్రయాణాలు చేయరా? అన్న సందేహాన్ని పలువురు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ లెక్కన అగ్రదేశాల ప్రజలు తిరిగే అన్ని దేశాల్లోనూ కూడా వ్యాక్సినేషన్‌ జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నది వారి వాదన. ఇటువంటి పరిస్థితుల్లో ఏవో కొన్ని దేశాలో తమకున్న ఆర్ధిక బలంతో వ్యాక్సిన్‌ మొత్తాన్ని తమతమ దేశాలకు తరలించుకుపోయినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది.

కోవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యేవారు, వైరస్‌తో పోరాడేవారిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించి, వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తే నిర్ణీత సమయంలో కోవిడ్‌ను అంతమొందించవచ్చన్నది సంబంధిత రంగంలోని నిపుణులు బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా కాని పక్షంలో వ్యాక్సిన్‌ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నది తేల్చేస్తున్నారు.

ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన దేశాలు.. ఈ రంగంలోని నిపుణులు చెబుతున్న మాటలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రాధాన్యతా క్రమంలో ప్రపంచంలోని మానవాళి మొత్తానికి వ్యాక్సిన్‌ సక్రమంగా అందించేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవరం కూడా ఉంది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం..

Show comments