iDreamPost
android-app
ios-app

విజృంభిస్తోన్న మంకీపాక్స్‌ వైరస్‌.. హెల్త్‌ ఎమర్జెన్సీ విధించిన WHO

  • Published Aug 16, 2024 | 11:19 AM Updated Updated Aug 17, 2024 | 11:19 AM

WHO-MPOX, Global Health Emergency: కరోనా ముప్పు ఇంకా ముగియనే లేదు. ఈ లోపు మరో మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ వివరాలు..

WHO-MPOX, Global Health Emergency: కరోనా ముప్పు ఇంకా ముగియనే లేదు. ఈ లోపు మరో మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published Aug 16, 2024 | 11:19 AMUpdated Aug 17, 2024 | 11:19 AM
విజృంభిస్తోన్న మంకీపాక్స్‌ వైరస్‌.. హెల్త్‌ ఎమర్జెన్సీ విధించిన WHO

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోవిడ్‌ వల్ల ప్రపంచం మరో 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. ఈ మహమ్మారి వల్ల కొన్ని లక్షల మంది మృతి చెందారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కోవిడ్‌ కట్టడి కోసం విధించిన లాక్‌ డౌన్‌ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఇప్పిడిప్పుడే ప్రపంచం దీన్నుంచి కోలుకుంటుంది. కోవిడ్‌ ముప్పు నుంచి పూర్తిగా కోలుకోకముందే.. ప్రపంచం ముంగిటకి మరో ప్రమాదం వచ్చి చేరింది. మరో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ వివరాలు..

కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా మంకీపాక్స్‌ కేసులు పెరిగిపోవడం, అది మిగిలిన దేశాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ ఎంపాక్స్ వైరస్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం రెండేళ్ల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

గతంలో మంకీ పాక్స్‌ అని పిలిచిన ఎంపాక్స్ కేసులు ఈ మధ్య కాలంలో ప్రమాదకర రీతిలో పెరుగుతుండటంతో.. ఇటీవలే ఆఫ్రికా సీడీసీ సైతం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఆఫ్రికాలో ఇప్పటి వరకూ 17 వేలకుపైగా అనుమానిత ఎంపాక్స్ కేసులు నమోదు కాగా.. సుమారు 517 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 167 శాతం అధికమని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అంతేకాక 13 దేశాల్లో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. దాంతో డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్‌ ఎమర్జెన్సీ ‍ప్రకటించింది.

వైరస్‌లో రెండు రకాలు..

ఎంపాక్స్‌లో క్లేడ్ 1, క్లేడ్ 2 అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో లేదా వైరస్ సోకిన జంతువులు, వైరస్ ఉన్న పదార్థాలతో కాంటాక్ట్ అయినప్పుడు ఈ రెండు రకాల ఎంపాక్స్ వైరస్‌లు ఇతరుల్లోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుతం ఆఫ్రికాలోని కాంగోలో క్లేడ్ 1 రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది అంటున్నారు వైద్యులు.

ఇప్పుడు వ్యాప్తి చెందేది ప్రమాదకర వేరియంట్..

క్లేడ్‌ 1 స్ట్రెయిన్‌కు చెందిన కొత్త రకం వైరస్ క్లేడ్ 1బీ ఇప్పుడు వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా తేలికగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. కాంగోలో మొదలైన ఈ వైరస్.. దాని పొరుగు దేశాలైన బురుండీ, కెన్యా, రువాండా, ఉగాండా తదితర దేశాలకు పాకడంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమైంది.ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసి, ప్రాణాలను కాపాడేందుకు అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పర సహకారం తప్పనిసరి అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియెసస్ తెలిపారు.

చిన్నారుల్లోనే ఎక్కువగా..

కాంగోలో నమోదైన కేసుల్లో 70 శాతం బాధితులు 15 ఏళ్ల లోపు వారేనని ఆఫ్రికా సీడీసీ అధికారులు తెలిపారు. దీని ద్వారా మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని వారు అంచనా వేస్తున్నారు. కాంగోలో రెండు వారాల పసికందుకు సైతం ఎంపాక్స్ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 3-4 శాతం ఉంటుందని ఆఫ్రికాకు చెందిన సీడీసీ ఎమర్జెన్సీ గ్రూప్‌‌కు చెందిన సలీం అబ్దుల్ కరీం వెల్లడించారు. 2022లో ఎంపాక్స్ క్లేడ్ 2 వేగంగా విస్తరించింది. దీంతో అప్పుడు కూడా డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.