iDreamPost
android-app
ios-app

పైరసీ భూతం ఆట కట్టించేదెవరు?

  • Published Jan 12, 2020 | 12:17 PM Updated Updated Jan 12, 2020 | 12:17 PM
పైరసీ భూతం ఆట కట్టించేదెవరు?

ఒకపక్క థియేటర్లో సినిమా లైఫ్ రానురాను కుంచించుకుపోతోంది. వంద రోజులు అనే మాట ఇక కలే. ఎంత పెద్ద హీరో అయినా నెల రోజులు స్క్రీన్లు ఎక్కువ తగ్గకుండా తన సినిమాను ఆడించుకోగలిగితే అది బ్లాక్ బస్టర్ కిందే లెక్క. ఇక చిన్న సినిమాల పరిస్థితి సరేసరి. మహా అయితే రెండు వారాలు. అదీ పోటీగా ఏవి లేకపోతేనే. ఇలాంటి క్లిష్టత ఇండస్ట్రీని సతమతం చేస్తుండగా మరోవైపు పైరసీ భూతం రోజురోజుకి జడలు విప్పుకుంటోంది. కొత్త సినిమా వచ్చిన మొదటి రోజే గంటల వ్యవధిలో వాటి తాలుకు ప్రింట్లు ఆన్ లైన్ లో పెడుతూ నిర్మాతలకు తీరని నష్టాన్ని ఆవేదనను కలిగిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది థియేటర్లలో సినిమా విడుదల కావడం సర్వసాధారణమైన నేపధ్యంలో ఏ చోట ఎక్కడ పైరసీ చేశారో కనుక్కోవడం దుర్లభంగా మారింది. ఒకవేళ సర్వర్ల ఆధారంగా ఆచూకి కనుక్కున్నా విదేశీ చట్టాల వల్ల ఏమి చేయలేని నిస్సహాయత మన వ్యవస్థది. ఇప్పటికే డిజిటల్ మీడియా దెబ్బకు సినిమాల వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపధ్యంలో పైరసీని ఇలా చూస్తూ వదిలేస్తే వారాలు పోయి సినిమాలు రోజులకు పరిమితమయ్యే ప్రమాదం ఉంది. మన సంక్రాంతి సినిమాలు కూడా పైరసీ బారిన పడ్డాయని టాక్ ఉంది. నిర్మాతలు ఇప్పటికే లింక్స్ ని తీయించే పనిలో బిజీగా ఉన్నారు. కాస్త ప్రభుత్వాలు కూడా ఈ అంశం గురించి సీరియస్ గా అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

తమిళనాడులో దర్బార్ మొదటిఆట పూర్తైన కొద్ది గంటలకే దాని తాలుకు ఆన్ లైన్ వెర్షన్ ఇంటర్ నెట్ లో ప్రత్యక్షమై ప్రొడ్యూసర్ కి షాక్ కలిగింది. వీళ్ళను పట్టుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా కనీస స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. దీనికి తెలుగు పరిశ్రమ మినహాయింపు కాదు. పైరసీలో చూడకండి అని పోస్టర్లలో విన్నపాలు చేసేదాకా వచ్చింది. అయినా ఆగడం లేదు.