అందరూ అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం బిజెపిలో చేరిన యువనేత, మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ నుండి తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా బిజెపి ఎంపిక చేసింది. సింధియా బిజెపిలో చేరి 24 గంటలు కూడా గడవకముందే ఈరోజు పార్టీ అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో సింధియాకు చోటు దక్కింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జ్యోతిరాదిత్య సింధియా అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ అయిందని సమాచారం. కాగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజు. రాజ్యసభ ఎన్నికలు మార్చి 26 న జరగనున్నాయి. ఈ దఫా మధ్యప్రదేశ్ నుండి ఖాళి అవుతున్న మూడు స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
అయితే తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ సింధియా మంగళవారం కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు. ఆయన రాజీనామాతో 114 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 22 మంది మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు రాజీనామా సమర్పించడంతో కమల్ నాద్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సింధియా మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. 2018 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చిన వాగ్ధానాలలో ఒక్కటి కూడా సక్రమంగా అమలుకాలేదని, పద్దెనిమిది నెలల తరువాత కూడా రైతులకిచ్చిన హామీలతో సహా వాగ్దానాలు ఏవీ నెరవేరలేదని సింధియా ఆరోపించారు.
తన తండ్రి తరువాత సింధియాల కుటుంబంలో కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న ఏకైక వ్యక్తి జ్యోతిరాదిత్య సింధియా కూడా చివరికి బిజెపిలో చేరడం విశేషం. ఇప్పటికే సింధియా నాయనమ్మ, గ్వాలియర్‌కు చెందిన రాజమాతా విజయరాజే సింధియా బిజెపి మాతృ సంస్థ భారతీయ జనసంఘ్ కు వ్యవస్థాపక సభ్యురాలుగా వ్యవహరించారు. సింధియా సొంత అత్తయ్యలు వసుంధర రాజే, యశోధర రాజే లు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చెయ్యబోయేముందు ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా లతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయిన నేపథ్యంలో వారిరువురు నుండి సింధియా కు స్పష్టమైన హామీ లభించిందని ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత సింధియాకు కేంద్రప్రభుత్వంలో క్యాబినెట్ ఖరారయ్యిందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతుంది. కొందరైతే ఏకంగా ఒకడుగు ముందుకేసి త్వరలోనే సింధియా కేంద్ర రైల్వే మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోపే మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.