iDreamPost
iDreamPost
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు పాత సామెత. సినిమా తీయడం ఈజీనే దాన్ని రిలీజ్ చేయడమే పెద్ద సవాల్ గా మారుతోంది ఇప్పటి నిర్మాతలకు. మరీ విచిత్రంగా పేరున్న హీరోలు నటించినవి కూడా ఆలా నెలల తరబడి ల్యాబులోనే మగ్గిపోతున్నాయి. శర్వానంద్ ఒకే ఒక జీవితం ఎప్పుడో పూర్తయ్యింది. టీజర్ వచ్చి ఎంత కాలమయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. మధ్యలో లిరికల్ వీడియోస్ అంటూ పాటలు వదిలారు తప్ప ఆ తర్వాత ఎలాంటి ఊసు లేదు. వరస డిజాస్టర్లతో శర్వా మార్కెట్ చాలా డ్యామేజ్ అయ్యింది. పెట్టిన పెట్టుబడంత థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే ఒకే ఒక జీవితం పురిటినొప్పులు పడుతోంది.
వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్. అమల అక్కినేని ఓ కీలక పాత్ర పోషించారు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ టైం ట్రావెల్ ఫాంటసీ డ్రామా ఎప్పుడు బయటికి వస్తుందో ఎవరూ చెప్పడం లేదు. నాగ శౌర్య నటించిన కృష్ణ వృందా విహారి సైతం ఇదే తరహాలో రిలీజయ్యే మార్గం దొరక్క సతమతమవుతోంది. ఆ మధ్య ఏప్రిల్ లో రిలీజ్ అనుకుని పోస్టర్లు చిన్న టీజర్ వదిలారు. ఆ తర్వాత నో అడ్రెస్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి బజ్ కూడా లేదు. నాగశౌర్యది కూడా శర్వా లాంటి కథే. లక్ష్య, వరుడు కావలెను మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవి కాస్తా తీవ్రంగా నిరాశపరిచాయి.
ఇమేజ్ ఉన్న హీరోల పరిస్థితి ఇలా ఉంటే ఇక బడ్జెట్ పరిమితుల మధ్య తీసేవాటి గురించి వేరే చెప్పాలా. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న కృష్ణవంశీకి రంగమార్తాండను పూర్తి చేసి ప్రపంచానికి చూపించడానికి చాలా టైం పట్టింది. ఇప్పటికీ డేట్ లాక్ చేయలేదు కానీ ఏదో ఒక రూపంలో తన సినిమా గురించి మాట్లాడుకునేలా ప్రమోషన్ మొదలుపెట్టారు. వీళ్లకే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఉత్సాహంతో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న నయా ప్రొడ్యూసర్లు ఇలాంటివి గమనించి విశ్లేషించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కరోనా టైంలో లాగా ఇప్పుడు ఓటిటిలు గుడ్డిగా సినిమాలు కొనేయడం లేదు. సవా లక్ష కండిషన్లు పెడుతున్నారు. సో తస్మాత్ జాగ్రత్త