Idream media
Idream media
మహమ్మరి కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. వైరస్‌ను అడ్డుకునేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు వీలైనంత మేరకు చర్యలు చేపడుతున్నాయి. ప్రజల్లో ధైర్యం నింపేందుకు, వారిని సమైక్యంగా ఉంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో కొంత మంది సెటైర్లు, హేళనలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ తన వాట్సాప్ సందేశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. బల్క్ మెస్సెజ్‌లు పంపడంపై నిషేధం విధించింది. ఒకసారి ఒక్క సందేశమే పంపేలా మార్పులు చేసింది.
కరోన వైరస్‌పై వదంతులు, అసత్య ప్రచారాలు వ్యాపింపజేయకుండా వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో అనవసరమైన ఆందోళనలు రేపుతున్న వదంతులను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని వాట్సాప్ నిర్ణయించింది. దేశంలో జనతా కర్ఫ్యూ, ఈ నెల 5వ తేదీన దీపం వెలిగించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. వైద్య, పోలీసు, పారిశుధ్య సిబ్బందికి సంఘీభావం తెలపడంతోపాటు ప్రజలందరిలో ఆందోళనలు తొలగించేందుకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే ప్రధాని పిలుపును హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ బల్క్ మెస్సెజ్‌లపై నిషేధం విధించడం గమనార్హం.