Idream media
Idream media
కరోనా మెల్లగా తన విశ్వరూపాన్ని చూపుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయ్, బెంగళూరుల్లో థియేటర్లు, మాల్స్ మూతపడుతున్నాయి. వేలాది మంది తాత్కాలికంగానైనా ఉపాధి కోల్పోతున్నారు. ఏ పూటకాపూట కూలి చేసుకుని బతికే వాళ్లకి కష్టకాలం రానుంది.
అయితే చైనాలాగా ప్రజల్ని కొద్దిరోజుల పాటు ఇల్ల నుంచి బయటకి రానివ్వని పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? చైనాలో పార్టీ వాలంటీర్లు ఇంటింటికి నిత్యావసర వస్తువులు, పిల్లలకు పాలు సరఫరా చేశారు. అక్కడ విషయాలేవీ బయటకు రావు కాబట్టి వాస్తవం మనకు తెలియకపోయినా ప్రజాసంక్షేమం పట్ల కొంత నిజాయితీగా అక్కడ ప్రభుత్వం ఉందని నమ్మొచ్చు.
మన దేశంలో ఉదాహరణకు ఢిల్లీనే ఆ రకంగా ప్రకటించాల్సి వస్తే ఏం జరుగుతుందో ఊహించడానికే కష్టం. ప్రధాని, రాష్ట్రపతి, హోంమంత్రి అందరూ ఉన్న నగరంలో , ఒకవైపు ట్రంప్ పర్యటిస్తుండగా ఘర్షణలు జరిగాయి. కనీసం వంద మంది చనిపోతే ఒక్క నాయకుడు కూడా వాళ్లని పరామర్శించలేదు. ప్రతిదీ రాజకీయంగా చూసే మన దేశంలో చైనా లాగా నగర దిగ్బంధనం జరిగితే ఎవరు దిక్కు?
హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో బడుగు జీవుల్ని ఆదుకోడానికి ప్రభుత్వమే ఏదో ఒకటి ఆలోచించాలి. కొన్ని వేల మంది అడ్డా కూలీలకి పని దొరక్కుండా పోతుంది. ఆటో డ్రైవర్లు ప్రయాణికులు లేకుండా పోతారు. ఇప్పటికే హైటెక్ సిటీ ప్రాంతంలో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్న వాళ్లు బేరం లేక మూసేస్తున్నారు. ప్రభుత్వాలు కఠినత్వంతోనే కాదు, మానవత్వంతో కూడా వ్యవహరించాల్సిన సందర్భం వచ్చింది.