iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి ఇప్పటికీ అంతంతమాత్రంగానే ఉంది. గత ఐదేళ్ల పాలనలో విభజన తర్వాత ఏకైక పరిశ్రమగా కియా మోటార్స్ నిలిచింది. అనంతపురం జిల్లాలో స్థాపించిన కియా మోటార్స్ కంపెనీ ఇటీవల ఉత్పత్తి ప్రారంభించింది. అయితే ఏపీలో మారిన రాజకీయ పరిణామాలతో పలు మార్లు కియా వార్తల్లోకెక్కుతోంది. ముఖ్యంగా విపక్షం పలు విమర్శల్లో భాగంగా కియా మోటార్స్ కూడా ఏపీ నుంచి తరలిపోయిందనే విమర్శలు వేస్తోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు అవే మాటలు చెప్పారు. ఆతర్వాత ఇప్పుడు దానికి అనుగుణంగా రాయటర్స్ కథనం వచ్చింది. తొలుత పరిశ్రమ పోయిందనే వాదన చంద్రబాబు చేయడం, ఆ వెంటనే ఈ కథనం రావడమే ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అనుమానాలు పెంచుతోంది.
కియా మోటార్స్ సంస్థ ఏపీ నుంచి తమిళనాడుకి తరలిపోవాలని భావిస్తున్నట్టు రాయటర్స్ కథనం. అందుకు చెబుతున్న కారణాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేసిన చట్టం మూలంగా కియా పరిశ్రమ యాజమాన్యం పునరాలోచనలో పడిందని పేర్కొన్నారు. అంతేగాకుండా మారిన రాజకీయ పరిస్థితులు, కంపెనీకి ఇచ్చిన రాయితీలను పునఃసమీక్షించడం వంటివి కారణాలుగా ఆ వార్తలో చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి ఏపీలో కన్నా తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఏం భిన్నంగా ఉన్నాయన్నది అంతుబట్టని విషయం. ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. కానీ తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుందనే సంకేతాలు సుస్పష్టం. అంతేగాకుండా స్థానికులకు ఉద్యోగ అవకాశాల చట్టం తమిళనాడులో తీసుకురావాలని డీఎంకే ఆశిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తో డీఎంకే స్టాలిన్ జరిపిన చర్చల్లో ఇలాంటి అంశాలు అనేకం చర్చకు వచ్చాయి. ఒక్క తమిళనాడు మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టం రూపకల్పనలో ఉన్నాయి. అయినా రాయటర్స్ రాతలు విడ్డూరంగా ఉన్నాయనే చెప్పవచ్చు.
మరోవైపు కియా మోటార్స్ పరిశ్రమను ఇప్పటికే సీఎం జగన్ సందర్శించారు. ఉత్పత్తుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశ్రమలకు అండదండలు అందిస్తామని తెలిపారు. అదే సమయంలో అనంతపురంలో మరో కొత్త పరిశ్రమ ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతోంది. ఎలక్ట్రికల్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటుకి ఇప్పటికే సన్నాహాలు షురూ అయ్యాయి. వాటితో పాటుగా దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ వంటి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమల రాయితీల విషయంలో ఆ పత్రిక వాదన విడ్డూరంగా కనిపిస్తోంది. రాజకీయ లక్ష్యాలతో సాగుతున్నట్టుగా పలువురు అనుమానించాల్సి వస్తోంది.
ఈ కథనాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఖండించింది. రాయటర్స్ రాతల ఆధారంగా ఓ వర్గం మీడియాలో సాగిస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టింది. కియా మోటార్స్‌పై రాయిటర్స్ కథనం పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటన విడుదల చేసింది. అసత్యాలతో కూడిన కథనం అని ప్రభుత్వం పేర్కొంది. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని, ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలు, కొందరు విలేకరుల ద్వారా వస్తున్న కథనాలకు ఇది కొనసాగింపుగా వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వచ్చిన కథనాలకు మరింత పదును పెట్టి నిరాధార రాతలను వార్తలు మలుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో కియా కథలో కహానీలు పదే పదే వినిపిస్తున్న తరుణంలో తాజా పరిణామాలు చర్చనీయాంశాలు మారాయి.