ప్రధానమంత్రి రాష్ర్టాల ముఖ్యమంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రల సూచనల సంగతేమో కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన రెండు ప్రతిపాదనలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. అందులో ఒకటి హెలికాప్టర్ మనీ ఐతే మరొకటి
Quantitative Easing (QE). దీంతో ఇప్పుడందరూ ఆ రెండు పదాలకు అర్ధం తెలుసుకొనే పనిలో పడిపోయారంటే అతిశయోక్తి కాదు.
హెలికాప్టర్ మనీ….
కరోనా తీసుకొచ్చిన ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం వద్ద తగినంత డబ్బులు లేవు…కాబట్టి దేశ జీడీపీలో 5 లేదా 6 శాతానికి సమానమైన మొత్తాన్ని(10 లక్షల కోట్లు) ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టాలి… ఇదీ సీఎం కేసీఆర్ ప్రధాన సూచన. దీనికి ఆయన హెలికాప్టర్ మనీ, క్యూఈ విధానాలను సూచించారు.
Mitlon Friedmen అనే నోబెల్ అవార్డ్ గ్రహీత 1969లో తొలిసారి హెలికాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించాడు. ఈ విధానంలో సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో డబ్బులు ముద్రించి నేరుగా ప్రజలకు పంచుతాయి. వరదల సమయాల్లో ప్రభుత్వాలు ఆహార పొట్లాలను హెలికాప్టర్ ల ద్వారా వెదజల్లినట్టు… హెలికాప్టర్ మనీ విధానంలో డబ్బులను హెలికాప్టర్ ల ద్వారా వేదజల్లక పోయినా అదే తరహాలో నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ప్రజలు ఈ విధానంలో అందుకున్న డబ్బును తిరిగి బ్యాంకులకు చెల్లిచాల్సిన అవసరం లేదు.
ఇలా చేయడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి…మార్కెట్లో ఆర్ధిక కార్యకలాపాలన్నీ ఊపందుకుంటాయని హెలికాప్టర్ మనీ థియరీ ప్రతిపాదిస్తుంది. ఐతే ఇలా చేయడం వల్ల ద్రవ్యోల్బణం తీవ్రమవుతుందే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదని పలువురు ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెలికాప్టర్ మనీని వ్యతిరేకించే వారిలో ప్రముఖుడిగా ఉన్నారు. ఈ విధానంలో డబ్బులు అందుకున్న ప్రజలు ఖర్చు పెట్టకుండా దాచుకునే ప్రమాదం ఉందని ఆయన గతంలో హెచ్చరించారు.
అలాగే హెలికాప్టర్ మనీ విధానానికి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందిన అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ బెన్ బెర్నెక్ సైతం ఆర్ధిక మాంద్యం ఎదుర్కుంటున్న జపాన్ కు 2016లో క్యూఈ విధానాన్నే సూచించటం గమనార్హం.
క్యూఈ విధానంలో సెంట్రల్ బ్యాంకులు ముద్రించిన డబ్బులను నేరుగా ప్రజలకు అందించవు. ఆ డబ్బుతో ప్రభుత్వం, బ్యాంకుల వద్దు నుంచి ఫైనాన్సియల్ అస్సెట్లు, బాండ్లను కొనుగోలు చేస్తుంది. తద్వారా ఆర్ధిక వ్యవస్థలోకి మనీ ప్రవాహాన్ని పెంచి ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకుంటుంది. కాగా కేసీఆర్ సూచించిన ఈ రెండింట్లో కేంద్రం దేన్నైనా ఎంచుకుంటుందా…ఇతర మార్గాలను అన్వేషిస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..!