iDreamPost
android-app
ios-app

జేసీ పవన్‌ హెచ్చరికల వెనుక ఆంతర్యం ఏమిటి..?

జేసీ పవన్‌ హెచ్చరికల వెనుక ఆంతర్యం ఏమిటి..?

తన బాబాయి జేసీ ప్రభాకర్‌ రెడ్డి, తమ్ముడు జేసీ అస్మిత్‌ల అరెస్ట్‌ను జేసీ దివాకర్‌ రెడ్డి తనయుడు, గత ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ పవన్‌ రెడ్డి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మాటల ద్వారా అర్ధమవుతోంది. తాజాగా ఓ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ పవన్‌ చేసిన వ్యాఖ్యలు రాయలసీమ నేతలతోపాటు రాజకీయ వర్గాలను ఆలోచింపచేస్తున్నాయి.

తాము అధికారంలో ఉన్న సమయంలో తన బాబాయి జేసీ ప్రభాకర్‌ రెడ్డి వైఎస్‌ జగన్‌ను దూషించినందుకే కక్షగట్టి అన్ని రకాలుగా తమను దెబ్బతీస్తున్నారని చెప్పిన జేసీ పవన్‌.. అప్పట్లో తన బాబాయి అలా మాట్లాడి ఉంటే క్షమాపణలు చెబుతున్నామని ఆనాడే చెప్పామన్నారు. కానీ జగన్‌ కక్ష గట్టి తమ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ, కేసులు, అరెస్ట్‌లద్వారా ఆత్మ స్థయిర్యం కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకు పదిరెట్లు ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

రాజకీయ నాయకులు ఇలాంటి హెచ్చరికలు, సవాళ్లు చేయడం మామూలే అయినా.. జేసీ పవన్‌ ఇంకాస్త ముందుకు వెళ్లి తమ రివేంజ్‌ ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. రాయలసీమలో ప్రస్తుతం ఫ్యాక్షన్‌ లేదని జగన్‌ మళ్లీ ప్రోత్సహిస్తున్నారని, మమ్మల్ని కూడా ఆ రొంపిలో పొర్లాడేలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జేసీ పవన్‌ వ్యాఖ్యలు.. పరోక్షంగా తాము మళ్లీ ఫ్యాక్షన్‌లోకి దిగుతామని, ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తామనే రీతిలో ఉన్నాయని అర్థమవుతోంది.

తమను ఇబ్బంది పెడుతున్న సీఎం జగన్‌కు భవిష్యత్‌లో అధికారం కోల్పోయినా ఆయనకు ఉన్న సెక్యూరిటీ వల్ల ఏమీ కాదని, కానీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, నేతల పరిస్థితి వేరుగా ఉంటుందని చెప్పడం వెనుక.. పరోక్షంగా మీపై ఫ్యాక్షన్‌ దాడులు చేస్తామనే అర్థం వచ్చేలా జేసీ పవన్‌ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల స్థానిక నేతలను భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు.. సీఎం జగన్‌ పట్ల వారిలో వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నించారు. సీఎం జగన్‌ జేసీ కుటుంబంపై పెడుతున్న కేసుల వల్ల భవిష్యత్‌లో తాము ఇబ్బంది పడతామనే భావనను స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల్లో కలిగేలా జేసీ పవన్‌ మైండ్‌ గేమ్‌ అడుతున్నట్లుగా ఉంది.

తన బాబాయిపై పెట్టిన కేసులు నిలబడబోవని చెప్పిన జేసీ పవన్‌.. బీఎస్‌ 3, బీఎస్‌ 4 వాహనాల కొనుగోలు, నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్‌పై తమ తప్పులేదనేలా మాట్లాడారు. ఓ పక్క ఇలా మాట్లాడుతూనే మరో వైపు ప్రతికారం తీర్చుకుంటాం, మాకుటైం వస్తుందని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందనేది అందరి నుంచి వినిపిస్తున్న మాట.