చంద్రబాబు అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..?

2015-19 మధ్య కాలంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరిట రూ. 214 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. తొలుత ఆ కేసులో తన పేరు లేదని, ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఏపీ సీఐడీ పోలీసులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తమ వద్ద సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయని, కోర్టుకు సమర్పించామని అధికారులు తెలిపారు. రిమాండ్‌కు తరలించాక ఆధారాలు చూపిస్తామని చంద్రబాబు తరుఫు న్యాయవాదులకు వెల్లడించారు పోలీసులు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి, విజయవాడ తరలించారు.

కాగా, ఆయన అరెస్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. చంద్రబాబు అరెస్టును టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే బీజెపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వ్యతిరేకించారు. సరైన నోటీసు ఇవ్వకుండా , ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడం సమర్థనీయం కాదని, బీజెపీ ఈ చర్యను ఖండిస్తుంది అంటూ పేర్కొన్నారు. తనను రాజకీయ దురుద్దేశాలతోనే అరెస్టు చేశారంటూ చంద్రబాబు అన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడితే నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేయవచ్చునని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక  రాజకీయ  కుట్ర లేదన్న ఆయన.. దర్యాప్తు ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని తెలిపారు.

ఇది రాత్రికి రాత్రి జరిగిందని కాదని, దాదాపు రెండేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదైందని అన్నారు. డిజైన్ టెక్ ద్వారా భారీ మొత్తంలో హవాలా డబ్బు టీడీపీ నేతల ఖాతాల్లోకి చేరిందని పేర్కొన్నారు.  చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రజా సొమ్మును అక్రమ మార్గాల్లో దోచుకున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఈ స్కాం జరిగిందన్న సజ్జల, అప్పట్లోనే ఆయన ఎందుకు నిష్పక్ష పాత దర్యాప్తు జరిపించలేదని నిలదీశారు. ఎఫ్ఐఆర్‌కు ముందే స్కాం బయట పడిందని తెలిపారు. 2017, 2018లోనే పూణెలో జీఎస్డీ విచారణలో షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించినట్లు అధికారులు అప్పుడే గుర్తించారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం సహజం అని, రెండేళ్లుగా కొనసాగుతున్న దర్యాప్తులో చంద్రబాబును ప్రశ్నించకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో బెనిఫీషియర్ చంద్రబాబు అని తేలడంతో అరెస్టు చేశారంటూ తెలిపారు.

Show comments