iDreamPost

సీమెన్స్‌ స్కాంలో చంద్రబాబు అరెస్ట్‌.. ఇంతకీ ఏంటా సీమెన్స్‌ స్కాం?

సీమెన్స్‌ స్కాంలో చంద్రబాబు అరెస్ట్‌.. ఇంతకీ ఏంటా సీమెన్స్‌ స్కాం?

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. షెల్‌ కంపెనీల ద్వారా 240 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ శనివారం ఉదయం చంద్రబాబును అరెస్ట్‌ చేసింది. చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడ్ని కూడా అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలా వ్యాప్తంగానే కాకుండా.. దేశ వ్యాప్తంగా సీమెన్స్‌ స్కాం సంచలనంగా మారింది. సోషల్‌ మీడియా వ్యాప్తంగా ఈ స్కాంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటీ సీమెన్స్‌ స్కాం?..

ఇంతకీ ఏంటీ సీమెన్స్‌ స్కాం?..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు 3300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని ఈ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 3300 కోట్ల రూపాయల్లో 10 శాతం ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ప్రభుత్వం 10 శాతం వాటాగా.. జీఎస్టీతో కలిపి 370 కోట్ల రూపాయల్ని సదరు సంస్థకు చెల్లించింది. అయితే, ఇందులో 240 కోట్ల రూపాయల్ని సీమెన్స్‌ సంస్థకు కాకుండా.. డిజైన్‌టెక్‌ సంస్థకు బదలాయించారని ఏపీ సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ 240 కోట్లకు సంబంధించి గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఈడీ దృష్టికి కూడా వెళ్లింది. ఈడీ దీనిపై దర్యాప్తు చేస్తోంది.

ఏపీ సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు!

240 కోట్ల రూపాయల అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన ఏపీ సీఐడీ.. అప్పటి ప్రభుత్వం షెల్‌ కంపెనీలకు 240 కోట్ల రూపాయలు మళ్లించినట్లు గుర్తించింది. ప్రభుత్వం చెల్లించిన 370 కోట్ల రూపాయల్లో 240 కోట్లను వివిధ షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు తేల్చింది. ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర కంపెనీలకు ఆ నిధులు మళ్లించినట్లు గుర్తించింది. గత ప్రభుత్వ హయాం సమయంలో సీమెన్స్ సంస్థ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ క‌న్విక‌ర్లు కుంభకోణంలో భాగం అయ్యారని సీఐడీ విచార‌ణ‌లో తేలింది. 3300 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం జీవోలో చూపించలేదని ఏపీ సీఐడీ గుర్తించింది.

సీమెన్స్‌ స్కాంలో ఏ1గా చంద్రబాబు నాయుడు!

2016-2018 మధ్య జరిగిన ఈ స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ-1గా..అచ్చెన్నాయుడు ఏ-2గా ఉన్నారు. చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదయ్యాయి. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. కాగా, ఈ స్కాంతో తమకు సంబంధం లేదని గ్లోబల్‌ సంస్థ సీమెన్స్‌ చెబుతోంది. త‌మ‌ కంపెనీ పేరుమీద మోసాలకు పాల్పడ్డారని, స్కాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అంటూ సంస్థ ఇంటర్నెల్‌ టీం పూర్తి ఆధారాల‌ను సీఐడీకి సమర్పించింది. మరి, దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ సీమెన్స్‌ స్కాంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి