Dharani
ఎంతో అందమైన భవిష్యత్తును ఊహించుకుని వివాహ బంధంలోకి ప్రవేశించిన ఆ మహిళ పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుముందే.. దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
ఎంతో అందమైన భవిష్యత్తును ఊహించుకుని వివాహ బంధంలోకి ప్రవేశించిన ఆ మహిళ పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుముందే.. దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Dharani
అందరిలానే ఆ మహిళ కూడా వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కన్నది. అర్థం చేసుకునే భర్త, మంచి అత్తమామలు రావాలని కోరుకుంది. యుక్త వయసుకు వచ్చిన కుమార్తెకు తల్లిదండ్రులు మంచి సంబంధం అని భావించి పెళ్లి చేశారు. తమకు ఉన్నంతలో బిడ్డకు కట్నకానుకలు ఇచ్చారు. అత్తారింట్లో తమ కుమార్తె నిండు నూరేళ్లు పచ్చగా వర్థిల్లాలని కోరుకున్నారు. పిల్లాపాపలతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని కలలు కన్నారు. కానీ వారి ఆశలన్ని ఆడియాసలయ్యాయి. పెళ్లైన నాలుగు నెలలకే నవ వధువు దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన హైదరాబాద్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ పర్వత్‌నగర్‌లోని బాబాగల్లీకి చెందిన బడిగినేని మాధవి మోహన్‌రావు రెండో కుమార్తె షమిత(29)కు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గండేపల్లికి చెందిన కృష్ణ ప్రవీణ్‌కుమార్‌తో నాలుగు నెలల క్రితం అనగా ఈ ఏడాది ఏప్రిల్ 20న వివాహం జరిగింది.
వివాహం సందర్భంగా షమిత తల్లిదండ్రులు ఆమె అత్తింటి వారికి రూ.2.50 లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. పెళ్లయిన నెలరోజుల వరకే ఆమె సంతోషంగా ఉంది. ఆ తర్వాత అత్తింటి వారి అసలు రంగు బయటపడింది. పెళ్లైన నెలకే అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు షమితను వేధింపులకు గురిచేసి, దారుణంగా కొట్టారు. ఇలా గొడవలు జరుగుతుండగానే షమిత దంపతులు పది రోజుల కిందట హైదరాబాద్ వచ్చి హయత్‌నగర్‌లోని సాయినగర్ కాలనీలో నివాసముంటున్నారు.
రెండు రోజుల క్రితం అనగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో షమిత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లోపలినుంచి గడియ వేసుకుంది. ఎంత సేపటికి బయటకు రాలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆమె భర్త.. ఇంటి ఓనర్‌తో కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఉరి వేసుకుని నిర్జీవంగా కనిపించింది. అదనపు కట్నం కోసం అత్త, తోటి కోడలు వేధించారని ఆమె తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన నాలుగు నెలలకు తమ కుమార్తె జీవితం ఇంత దారుణంగా ముగిసిపోతుందని ఆ తల్లిదండ్రులు ఏమాత్రం ఊహించలేదు. తమకు ఇంత కడుపుకోత మిగిల్చిన షమిత అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు