iDreamPost
android-app
ios-app

ప్రభాస్ చేయకపోవడమే బెటర్

  • Published Feb 23, 2020 | 4:14 AM Updated Updated Feb 23, 2020 | 4:14 AM
ప్రభాస్ చేయకపోవడమే బెటర్

రెబెల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్ మొత్తానికి  ఆల్ టైం బెస్ట్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది భక్త కన్నప్ప. గరళకంఠుడు శివుడి కోసం తన కన్నునే త్యాగం చేసిన ఈ భక్తాగ్రేసరుడి కథను దర్శకులు బాపు నభూతో నభవిష్యత్ అనే రీతిలో తెరకెక్కించారు. ఇప్పటికీ కన్నప్ప మీద ఎవరూ మరో సినిమా తీయకపోవడానికి కారణం బాపు గారి కన్నా గొప్పగా ఆ గాధను చూపలేమన్న భయమే. అయితే ఎట్టకేలకు మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు హీరోగా అరవై కోట్ల బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తారమని ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 

పెదనాన్న సినిమా కాబట్టి ఇది ప్రభాస్ చేసుంటే బాగుండేదన్న అభిప్రాయం కొందరు ఫ్యాన్స్ లో వ్యక్తమవుతున్నప్పటికీ ఒకరకంగా చెప్పాలంటే అలాంటి జానర్ ని డార్లింగ్ ఇప్పట్లో టచ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ పాన్ ఇండియా లెవెల్ ని దాటేసింది. కన్నప్ప లాంటి కథలు శివ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలో ఆడుతుందేమో కానీ బయట మార్కెట్ చేయడం కష్టం. అందులోనూ ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలను అలాంటి కథల్లో ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది అనుమానమే. 

మంచు విష్ణుకు ఇమేజ్ లాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఎలాంటి మార్పులు లేకుండా కన్నప్ప కథను తీసుకోవచ్చు. అదే ప్రభాస్ అయితే కొన్ని కమర్షియల్ సూత్రాలకు లోబడి మార్పులు చేయాల్సి ఉంటుంది. గతంలో చిరంజీవి ఈ పొరపాటు చేశారు. అభిమానుల కోసం శ్రీమంజునాథలో పెట్టిన డాన్సులు పాటలు అంతగా వర్కవుట్ కాలేదు. అంచనాలు మితిమీరి పోవడంతో సినిమా బాగున్నా శ్రీమంజునాథ ఆడలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోలతో కన్నప్ప చేస్తే ఇదే రిస్క్ రిపీట్ అవ్వడం ఖాయం. అందుకే ప్రభాస్ ఫాన్స్ దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని పరిశ్రమ ప్రముఖుల అభిప్రాయం. అయితే కృష్ణంరాజుగారిలో ఎప్పటికైనా కన్నప్పగా ప్రభాస్ ని చూడాలన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు ఈ వార్త తెలిశాక ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మంచు విష్ణు కన్నప్పకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.