iDreamPost
android-app
ios-app

ఎల్టీ పాలిమర్స్ ఎపిసోడ్ లో చాటిచెప్పిన జగన్ పంథా

  • Published May 18, 2020 | 1:56 AM Updated Updated May 18, 2020 | 1:56 AM
ఎల్టీ పాలిమర్స్ ఎపిసోడ్ లో చాటిచెప్పిన జగన్ పంథా

ఎక్కడో జరిగిన తప్పిదానికి..వేరెవరో బలి అయిన ఘటన అందరినీ కలచివేస్తుంది. అలాంటిది ఎప్పుడు, ఎక్కడ జరిగినా కలవరపడాల్సి ఉంటుంది. అలాంటి ఓ పారిశ్రామిక ప్రమాదంలో ప్రజల ప్రాణాలు కేవలం ఆక్సిజన్ అందని కారణంతో కోల్పోవడం మరింత అలజడి రేపుతుంది. అలాంటి సమయంలో బాధ్యత గల ప్రభుత్వం ఎలా వ్యవహరించాలన్నది తాజాగా ఏపీ ప్రభుత్వం రుజువు చేసింది. ముఖ్యమంత్రిగా జగన్ పనితీరుకి ఎల్జీ పాలిమర్స్ ఎపిసోడ్ ఓ ఉదాహరణగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. తనదైన పంథాలో కదులుతూ ప్రజల సంక్షేమం కోసం జగన్ ఏమైనా చేస్తారనే అభిప్రాయాన్ని విశాఖలో జరిగిన ఈ కంపెనీ ప్రమాదం చాటి చెప్పింది.

మే 6వ తేదీ తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. మానవతప్పిదం వల్ల జరిగినట్టు ప్రాధమిక నిర్ధారణ అయ్యింది. కంపెనీ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎన్జీటీ వంటివి దానికి అనుగుణంగా స్పందించాయి. అదే సమయంలో సీఎం జగన్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యారు. యంత్రాంగాన్ని కదిలించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో స్వయంగా తాను రంగంలో దిగారు. హుటాహుటీన విశాఖ కేజీహెచ్ కి వెళ్లి బాధితులకు అండగా ఉంటాననే భరోసా కల్పించారు. ఆ సందర్భంగా ఆస్పత్రిలో జగన్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంంది. భేషజాలకు పోకుండా సమీక్ష సందర్భంగా విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను కలుపుకుని పోయిన తీరు విశేషంగా మారింది.

ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ స్పష్టంగా ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టేశారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తేల్చేశారు. ఉన్నతాధికారులతో వేసిన కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. కంపెనీ కొనసాగించాలా లేదా తరలించాలా అన్నది కూడా దర్యాప్తు కమిటీ నిర్దేశిస్తుందని వెల్లడించారు. దానికి అనుగుణంగానే పది రోజులు గడవకముందే ఏపీ చరిత్రలోనే కాకుండా భారతదేశంలోనే తొలిసారిగా ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం చేతికి అందించారు. ఇక చికిత్స పొందిన వారికి రూ. 10లక్షల పంపిణీ పూర్తి చేశారు. ఆ వెంటనే ప్రమాద ప్రాంతంలో ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఇస్తామని చెప్పిన మాటను పది రోజులు గడవకముందే పూర్తి చేశారు. ఇలా ఓ వైపు కమిటీ దర్యాప్తు సాగిస్తూ, మరోవైపు నష్టపరిహారం పంపిణీ కూడా వెంటనే పూర్తి చేసిన ఘటన ముఖ్యమంత్రికి దక్కుతుందని బాధితులు సైతం చెబుతున్నారు.

రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటూ, తన మంత్రివర్గ సహచరులు, అధికార యంత్రాంగాన్ని విశాఖలో బాద్యతలు నిర్వహించేలా మార్గనిర్దేశం చేస్తూ, కంపెనీలో నిల్వ ఉన్న స్టైరిన్ నిల్వలు ఉన్నపళంగా కొరియాకి తరలించేలా ఏర్పాట్లు చేస్తూ, బాధితులందరికీ నష్టపరిహారం పంపిణీలో పక్కా ప్రణాళికాబద్దంగా వ్యవహరించిన ప్రభుత్వం తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. గతంలో వివిధ ప్రమాద సమయాల్లో తాను డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇప్పుడు సీఎంగా ఉన్న సమయంలో అందించడం ద్వారా జగన్ తన పంథాను స్పష్టం చేశారు. ఏపీలో ప్రజల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందనే సంకేతాలు చాటిచెప్పారు. నిష్పక్ష పాతంగా విచారణ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారోననే చర్చకు ఆస్కారం ఇచ్చారు. మొత్తంగా దటీజ్ జగన్ అనే రీతిలో ఈ ఉదంతం సాగడం విశేషంగా మారింది.