గ్రాఫిక్స్ గందరగోళం – అంతులేని కథ

ప్రభాస్ ఆది పురుష్ టీజర్ తాలూకు గ్రాఫిక్స్ రామాయణం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న అజయ్ దేవగన్ కు చెందిన ఎన్వైవి విఎఫ్ఎక్స్ వాలా అనే సంస్థ ఈ సినిమా తాలూకు విజువల్ ఎఫెక్ట్స్ తో తమకు సంబంధం లేదని ఒక ప్రత్యేక నోట్ విడుదల చేయడం పెద్ద చర్చకే దారి తీసింది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరూ అడక్కుండానే సదరు కంపెనీ క్లారిటీ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కు చెందిదని తెలిసి షాక్ తిన్నారు. ఇంతా చేసి ఆ ఎన్వైవి నడిచేది ప్రసాద్ సుతార్ అనే వ్యక్తి కనుసన్నల్లో. ఇతని పేరు ఆది పురుష్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో ఉంది. ఇదింకో గందరగోళం

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న అయోధ్యలో ఈవెంట్ జరిగాక ప్రభాస్ తన రూమ్ కి రమ్మని దర్శకుడు ఓం రౌత్ కాసింత కోపంగా పిలుస్తున్నట్టు కనిపించిన వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. ఇది అతన్ని క్లాస్ పీకడానికేనని టీజర్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ గురించి అప్పటికే డార్లింగ్ చేరిపోయిందని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. అసలక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ట్రోలర్స్ మాత్రం మీమ్స్ తో పండగ చేసుకున్నారు. అక్కడితో అయిపోలేదు. ఆది పురుష్ లో సైఫ్ అలీ ఖాన్ గెటప్, వస్త్రధారణ, ఆంజనేయుడు లెథర్ డ్రెస్సు వేసుకోవడం గురించి రకరకాల విమర్శలు, వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇవి ఎక్కడ ఆగుతాయో చెప్పడం కష్టం.


నిజానికి ఈ తరహా కాంట్రావర్సీ పబ్లిసిటీకి పనికివచ్చేదే అయినా ఆది పురుష్ కి ఇలాంటి కృత్రిమ ప్రచారం అవసరం లేదు. వాళ్ళు మాములుగా ఉన్నా సరిపోతుంది. అలా కాకుండా టీజర్ ని ఎవరితో చెక్ చేయించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా నేరుగా రిలీజ్ చేయడం వల్లే ఇప్పుడీ పరిస్థితి తలెత్తింది. ఇంతకీ ప్రభాస్ కైనా చూపించారా అనే అనుమానం కలిగితే అది ఫ్యాన్స్ తప్పు కాదు. అసలే ప్యాన్ ఇండియా లెవెల్ లో అయిదు వందల కోట్ల బడ్జెట్ అని పదే పదే చెబుతూ హైప్ పెంచుతున్న తరుణంలో ఇలా జరగడం టి సిరీస్ యూనిట్ కి పెద్ద షాక్. దీన్ని సరిదిద్దే క్రమంలో ఏం చేయాలనే చర్చల్లో ఇప్పుడా బృందం బిజీగా ఉందట. నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గానే తీసుకున్నారు

Show comments