iDreamPost
android-app
ios-app

ఇది బజారు కాదు.. – వెంకయ్య నాయుడు

ఇది బజారు కాదు.. – వెంకయ్య నాయుడు

గురువారం రాజ్యసభ జీరో అవర్ లో చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. దేశంలో కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో.. కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యమైందని ఆరోపిస్తూ విపక్షాలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. విపక్ష సభ్యులు ఒకదశలో పోడియాన్ని చుట్టుముట్టి స్పీకర్ స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంత వారించినా వినకుండా పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయడు కల్పించుకుంటూ దయచేసి సభ్యులందరు సమన్వయం పాటించి వారివారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని సూచించారు. జీరో అవర్ లో కేవలం ముందస్తుగా నోటీసులు ఇచ్చిన అంశాల మీద మాత్రమే మాట్లేడే అవకాశం ఇస్తానని, అంతేతప్ప ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మధ్యలో వచ్చి తమకు నచ్చిన అంశాల మీద విపక్ష సభ్యులు చర్చకు పట్టు పట్టడం, సభను అడ్డుకోవడం తగదన్నారు. పార్లమెంట్ సభా సంప్రదాయాలను సభ్యులందరు గౌరవించాలని అలా కాని పక్షంలో దేశ ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉందని, కాబట్టి సభ్యులు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని వెంకయ్య హితవు పలికారు.

అయినప్పటికీ కొందరు విపక్ష సభ్యులు తమ నినాదాలను కొనసాగించడంతో ఒకదశలో వెంకయ్య నాయుడు విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఇది బజారు కాదు పార్లమెంట్.. ‘ (దిస్ ఈజ్ పార్లమెంట్ నాట్ ఏ బాజార్) అంటూ సభాధ్యక్షుడ్ని ఎవరు నిర్ధేశించలేరని స్పష్టం చేశారు. సభ్యులు వెంటనే నినాదాలు ఆపాలని అవి రికార్డ్స్ లో నుండి తొలగిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ సభ నియంత్రణలోకి రాకపోవడంతో సభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్యసభను నిరవధికంగా రేపటికి వాయిదా వేశారు.