iDreamPost
android-app
ios-app

వ్యాక్సిన్ త‌యారీ కేంద్రంగా ఏపీ

వ్యాక్సిన్ త‌యారీ కేంద్రంగా ఏపీ

“గొడ్డు వ‌చ్చిన వేళ‌.. బిడ్డ వ‌చ్చిన వేళ అని మ‌న రైతులు సంతానంతో స‌మాన స్థాయిని ప‌శు సంప‌ద‌కు ఇచ్చి – ప‌శువుల‌ను కొనేందుకు మంచి రోజు కోసం ఎదురుచూస్తుంటారు. ఆవులేనింట అన్నం కూడా తిన‌రాద‌ని కొన్ని చోట్ల అంటుంటారు. ఇంత‌టి కీల‌క‌మైన ప‌శు పోష‌ణ‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రాన్ని మా ప్ర‌భుత్వం గుర్తించింది. ఆర్థిక ప‌శు పోష‌ణ‌కు ఉన్న ప్రాథాన్యాన్ని, దాని అవ‌స‌రాన్ని అవ‌గ‌తం చేసుకుని చేయూత‌గా నిల‌వాల‌ని నిర్ణ‌యించింది.”
– ఇవి కొద్ది రోజుల క్రితం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతూ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ చేసిన వ్యాఖ్య‌లు. ఇది జ‌రిగి స‌రిగ్గా నాలుగు రోజులు కూడా కాకుండానే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌శు సంప‌ద ప‌రిర‌క్ష‌ణ దిశ‌గా కీల‌క‌మైన అడుగు వేసింది. పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు తయారు చేసేందుకు ప్రపంచస్థాయి వ్యాక్సిన్ త‌యారీ కేంద్రం రాష్ట్రంలో ఏర్పాటు దిశ‌గా కీల‌క ఒప్పందం జ‌రిగింది.

పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు కానుంది. ఈ మేర‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం కుదురింది. గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్లు ఇక‌పై రాష్ట్రంలోని ఈ త‌యారీ కేంద్రంలోనే జరుగుతాయి. సుమారు రూ. 50 కోట్ల పెట్టుబ‌డితో తయారీ యూనిట్ ను ఐజీవై ఏర్పాటు చేయ‌నుంది. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి కావాల్సిన అన్ని సదుపాయాలనూ కల్పించనుంది. స్థానికంగా ఉండే వంద‌లాది మందికి ఉపాధి కూడా ల‌భించ‌నుంది. మన రైతుల అవసరాలు తీరిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది.ఈ మేరకు ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం కుదురింది. 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించనున్నారు.

ఇదే ప్ర‌ప్ర‌థ‌మం…

ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ త‌యారీ యూనిట్ రాష్ట్రంలో అందుబాటులో లేదు.. ఒక్కో సారి వ్యాక్సిన్ లు స‌రైన స‌మ‌యానికి దొర‌క‌క‌పోవ‌డం ప‌శువుల‌కు ప్రాణాంత‌కంగా మారేది. రైతు కూడా తీవ్రంగా న‌ష్ట‌పోయేవాడు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఏపీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయిన‌ప్ప‌టికీ గ‌త ముఖ్యమంత్రి చంద్ర‌బాబు దానిపై దృష్టి సారించ లేదు. జ‌గ‌న్ రైతుల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్ర ఏర్పాటుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. కొద్ది నెల‌ల్లోనే త‌యారీ యూనిట్ అందుబాటులోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ ఐజీవై ప్ర‌తినిధుల‌కు సూచించారు.