ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఈ రోజు ఆయన పర్యటనను అడ్డుకుంటామని వైసిపి కార్యకర్తలు పిలుపునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ని అడ్డుకొని ఆయనకు తమ నిరసనను తెలియజేయడానికి ఈ ఉదయమే వైసిపి కార్యకర్తలు, మూడురాజధానులకు అనుకూలంగా ఉన్న ప్రజలు, మహిళలు భారీగా ఎయిర్పోర్ట్ కి చేరుకోన్నారు. విశాఖపై విషంగక్కిన చంద్రబాబు మళ్ళీ ఇక్కడికి రావడానికి సిగ్గులేదా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.విశాఖ అంటేనే ఆగ్రహంతో ఊగిపోతున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పేదాకా ఎయిర్పోర్ట్ నుండి కదలనివ్వబోమని బీష్మించుకొని కూర్చున్న వైసిపి కార్యకర్తలు బాబు గోబ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తుండడంతో అదేసమయంలో మరోవైపు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెలుగుదేశం శ్రేణులు కూడా ఎయిర్పోర్ట్ కి తరలిరావడంతో ఇరు పక్షాల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొని వుంది.
దీనితో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకదశలో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఇదే సమయంలో అటువైపుగా వచ్చిన మాజీ మంత్రి అచ్చెంనాయుడి కారుకు అడ్డుపడిన వైసిపి కార్యకర్తలు కారుముందు కూర్చొని తమ నిరసన తెలియచేశారు. దీనితో పోలీసులు వైసిపి కార్యకర్తలను చెదరగొట్టి అచ్చెంనాయుడు ని అక్కడ నుండి ఎయిర్పోర్ట్ లోకి తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్ ఎదుట మోహరించిన ఇరువర్గాల కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో హై టెన్షన్ కు దారితీసింది. ఎయిర్పోర్ట్ కి వెళ్లే హైవే పై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎయిర్పోర్ట్ ప్రాంగణం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈరోజు విజయనగరం పర్యటనకు బయలుదేరుతున్న బాబు మూడు రాజధానుల అంశంపై ఉత్తరాంధ్ర ప్రజలకు ఏమైనా స్పష్టత ఇస్తాడా ?? అమరావతే ఏకైక రాజధాని అంటూ ఉత్తరాంధ్రలో కూడా బహిరంగంగా తనవైఖరి ప్రకటిస్తాడా ?? లేక గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో వ్యవహరించిన తీరుగా “రెండు కళ్ళ సిద్ధాంతం.. కొబ్బరి చిప్పల వేదాంతం..” తరహాలో నాకు మూడు ప్రాంతాలు ముఖ్యమేనని సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం ఈ పరిణామాలన్నీ గమనిస్తునే ఉన్నారు