iDreamPost
android-app
ios-app

సహజసిద్ధమైనదా..? కృత్రిమమా..? కరోనా వైరస్ పై అమెరికా విచారణ..!

సహజసిద్ధమైనదా..?  కృత్రిమమా..? కరోనా వైరస్ పై అమెరికా విచారణ..!

చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా వైరస్ వల్ల ప్రభావితం కాని దేశాల సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఏడు ఖండాలకు ఈ మహమ్మరి వ్యాపించింది. యూరోపియన్ దేశాలతో పాటు అగ్రరాజ్యమైన అమెరికాను గజగజలాడిస్తోంది. అమెరికాలో ఆరు లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడగా, 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కు వ్యాక్షిన్, ఔషధం లేకపోవడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న పలు దేశాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. ప్రజా జీవనం స్తంభించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మునుపెన్నడూ చవిచూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

చైనాలోని వూహాన్ నగరానికే కరోనా వైరస్ పరిమితం కావడం, ప్రపంచ దేశాలకు విస్తరించడంతో ఈ వైరస్ ను చైనా తయారు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ మీడియా పలు పరిశోధన కథనాలను ప్రచురించింది. వూహాన్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాబ్ లో కరోనా వైరస్ ను రూపొందించారని ఆ కథనాల సారాంశం. చైనా లో వైరస్ ప్రభావాన్ని, మరణాలను ఆ దేశం తక్కువ చేసి చూపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై అమెరికా విచారణ చేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ ను వూహాన్ సమీపంలోని ల్యాబ్ లో చైనా తయారు చేసిందని అమెరికా కూడా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ పూర్వాపరాలను విచారించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ అంశంపై ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. సదరు ల్యాబ్ కు ఒబామా హయం నుంచి అమెరికా ఆర్థిక సహాయం చేస్తోంది. తాజా పరిస్థితుల నేపధ్యంలో సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.