Idream media
Idream media
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కేరళ వరకూ వచ్చేసరికి చిన్నబోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విజృంభిస్తున్న వైరస్.. కేరళలో కాస్త నెమ్మదిగానే ఉంది. ఇప్పటి వరకూ అక్కడ నమోదైన కేసులు 3,600 మాత్రమే.. వారిలో కేవలం ఇద్దరు మాత్రమే మృతి చెందారు. అందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజా టీచర్ ముందు చూపు.. నిబద్ధతతో కూడిన అప్రమత్తతే కారణం.. అని చెప్పక తప్పదు. అందుకే ప్రపంచానికే పెద్దన్న అయిన ఐక్య రాజ్య సమితి సైతం కరోనా నియంత్రణలో ఆమె సేవలను గుర్తించింది. ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభలో ప్రసంగించాల్సిందిగా భారతదేశం మొత్తం మ్మీద ఆమె ఒక్కరికే ఆహ్వానం అందింది. కరోనా నియంత్రణకు అన్ని రాష్ట్రాలూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కట్టడికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
కమ్యూనిస్ట్ రాష్ట్రానికే ఆ గుర్తింపు ఎందుకంటే…
కరోనా వైరస్ విజృంభిస్తుందని ఆరంభంలోనే కేరళ ఆరోగ్య మంత్రి శైలజ గుర్తించారు. చైనాలోని వూహాన్ నగరంలో వైరస్ వ్యాధి తలెత్తిందన్న వార్తలు రాగానే.. ఆమె అప్రమత్తం అయ్యారు. అప్పటికి ఆ వ్యాధి పేరు తెలీదు. జలుబు, దగ్గు ప్రధాన లక్షణాలని తెలుసుకున్నారు. గతంలో నిఫా వైరస్ సోకినప్పుడు దాదాపు 40 వేల మంది వలంటీర్లతో ఆమె ఆ వైరస్ ను అరికట్టగలిగారు. ఒక్క మరణం కూడా లేకుండా చూశారు. నిఫా అనుభవంతో కరోనా కీడును ముందుగానే పసిగట్టారు. సీఎం పినరయి విజయన్ తో చర్చించి.. ఆయన సహకారంతో చర్యలకు ఉపక్రమించారు. వూహాన్‌లో వైద్యం, ఇంజనీరింగ్ చదువుతున్న కేరళ యువతకు ఆ వైరస్ సోకి, వారు స్వరాష్ట్రానికి తిరిగి వస్తే, అది ఇక్కడ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని ఆమె ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేశారు.
కేరళ సీఎం ఆమెకు పూర్తి సహాయ, సహకారాలు అందించారు. దీంతో ఆమె క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు మొదలు పెట్టారు. దేశంలోని మొదటి మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆ రాష్ట్రంలోనే బయటపడ్డాయి. అయితే శైలజ మార్గదర్శకత్వంలో వైద్య బృందాలు ఆ వ్యాధి వ్యాప్తిని నియంత్రించగలుగుతున్నాయి. తొలిసారి కరోనా వైరస్ లక్షణాల వ్యక్తి కనిపించినపుడు ఆ రాష్ట్రం అంతగా ఆందోళన చెందలేదు. ఆ రోగిని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి.. నయం చేసి పంపించారు. మరో ఇద్దరు రోగులనూ సురక్షితంగా ఇంటికి పంపారు. ఆరంభం నుంచే ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో క్వారంటైన్ పీరియడ్ 14 రోజులుంటే కేరళలో 28 రోజులు.
ఆమె డాక్టరా..?
ఓ కొత్త వైరస్ అడ్డుకునేందుకు ఇంత ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ఆమె డాక్టరేమో.. అని చాలా చర్చిస్తున్నారు. ఇంటర్నెట్ లోనూ సెర్చ్ చేస్తున్నారు. కానీ.. అరవై మూడేళ్ళ శైలజ వైద్యురాలు కాదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం కూడా ఇదే తొలిసారి. కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా కూతుపరంబాలో జన్మించిన శైలజ సైన్స్ పట్టభద్రురాలు. కన్నూరులోని శివపురం హైస్కూల్‌లో ఏడేళ్ల పాటు.. రసాయన శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పని చేశారు. కాలేజీలో చదువుతున్నప్పుడే సీపీఐ (ఎం) భావజాలం పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. ఆ పార్టీ విద్యార్థి విభాగంలో చేరి చురుగ్గా పని చేశారు. ఉపాధ్యాయినిగా ఉద్యోగవిరమణ తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు.
ఐరాస సమావేశంలో శైలజ ఏం మాట్లాడారంటే…
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అత్యధిక కృషి చేసిన ప్రజా ప్రతినిధుల్ని, ప్రభుత్వ అధికారుల్ని గౌరవించడంలో భాగంగా ఐరాస ఈ సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఒకే ఒక వ్యక్తి కె.కె.శైలజ. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు ఐరాసలో ఆన్‍లైన్ ద్వారా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. “మా రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది. ప్రభుత్వంలో ప్రజలు కూడా భాగస్వామమయ్యారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ రోజూ కరోనా నియంత్రణ చర్యలపై సమావేశం నిర్వహించేవారు. ఎక్కడా ప్రభుత్వంపై నెగెటివ్ ఇంపాక్ట్ పడకుండా చర్యలు చేపట్టాలని సూచించేవారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో లేకుండా చర్యలు చేపట్టాము. సివిల్ సప్లయి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, చివరకు విద్యాశాఖ కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ప్రతి ఒక్కరికీ భోజనం అందించాము. 1325 కమ్యూనిటీ కిచెన్ లు ఏర్పాటు చేశాం. అక్కడ వారికి కావాల్సిన అన్ని సరుకులూ అందుబాటులో ఉంచాము. సుమారు 6 లక్షల మంది వరకూ అక్కడ వసతి పొందారు. పిల్లల పోషకాహార నిపుణులను కూడా నియమించాం. 3,700 ల్యాబ్ లు ఏర్పాటు చేశాం. కరోనా నియంత్రణకు 3, 40, 000 మందితో సోషల్ వారియర్స్ టీం ఏర్పాటు చేశాం. వైరస్ నియంత్రణకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది.”” అని రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
కరోనా వారియర్స్ కు ఐరాస అభినందనలు
ఈ సమావేశంలో.. కరోనా సంక్షోభ సమయాన వైద్య సేవలు అందిస్తూ ముందుండి పోరాడుతున్న వివిధ శాఖల్లోని సిబ్బంది విధుల్ని ఐరాస కొనియాడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఇంటికే పరిమితమైన వేళ, సామాజిక, సంక్షేమం, సరుకుల రవాణా, మొదలైన విభాగాల్లో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్వహిస్తున్న విధుల్ని ప్రశంసించింది. తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, ఇకముందు కూడా ఇది కొనసాగాల్సిన అవసరముందని ఐరాస అభిప్రాయపడింది. పబ్లిక్ సర్వీస్ డే కార్యక్రమలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ సహా వివిధ విభాగాల అధిపతులు పాల్గొని ప్రసంగించారు.