iDreamPost
android-app
ios-app

ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి వర్సెస్ రామ్మోహన్ నాయుడు

ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి వర్సెస్ రామ్మోహన్ నాయుడు

 శ్రీకాకుళం ఎంపి కింజరపు రామ్మోహన్ నాయుడుని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా చంద్రబాబు నియమించనున్నారని రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మరింతగా పెద్ద చిన్న అని తేడా లేకుండా ట్విట్టర్ లో రెచ్చిపోతున్నారు.

ఇదిలా ఉండగా వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, రామ్మోహన్ నాయిడు మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. వాడుకొని వదిలేసే చంద్రబాబు చరిత్రను తెలియజేస్తూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. చంద్రబాబు వైఖరి వల్లనే సీనియర్లు పక్కకు జరుగుతున్నారని, ఆ ముళ్లు కిరీటాన్ని తీసుకునేందుకు ఏవరూ సాహసించకపోతే దాన్ని అమాయకుడైన రామ్మోహన్ నాయుడుకి చంద్రబాబు కట్ట బెట్టేందుకు యత్నిస్తున్నారని హెచ్చరిస్తూ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేతప్ప రామ్మోహన్ నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ లేదని, ఇదే విషయాన్ని రామ్మోహన్ నాయుడుకి తెలియాల‌ని విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు.

రామ్మోహన్‌ నాయుడుపై విజయసాయి ట్వీట్ ఏం ట్విట్ చేశారంటే..?

కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్‌కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.’’ అంటూ రామ్మోహన్‌ నాయుడిపై వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయి ట్వీట్‌కు రామ్మోహన్ కౌంటర్

విజయసాయిరెడ్డి ట్విట్ కు ఎంపి రామ్మోహన్ నాయుడు నాకు సలాహాలొద్దు అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ని వొదిలి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు  విజయసాయిరెడ్డి గారు అంటూ రామ్మోహన్ నాయుడు ట్విట్ చేశారు. అయితే రామ్మోహన్ కౌంటర్ కు వైసిపి వర్గాల నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం ఏడాదే అవుతుంది. కానీ మీ నేత చంద్రబాబు నేతృత్వంలో టిడిపి గత ఐదేళ్లు పాటు పాలించి ఏం చేసిందని ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో మీ పార్టీని చిత్తుగా ఓడించారుగా…అప్పుడే మరిచితివా రామ్మోహనా అంటూ వ్యంగ్య‌స్త్రాల‌ను వ‌దులుతున్నారు. అవినీతి గురించి టిడిపి నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది రామ్మోహన్ నాయుడు గారు కాస్తా తెలుసుకోండ‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఓటుకు నోటు కేసును మరిచిపోయారా..? ఆ కేసు ఇప్పటికి సుప్రీం కోర్టులో ఉందనే అంశం గుర్తు‌లేదా.‌.? ఇలా అనేక మంది రామ్మోహన్ మీద విరుచుకుపడ్డారు.

సొంత మామను సిఎం కుర్చీ ల్లోంచి దింపేసి, ఆ పార్టీని లాక్కొని గద్దెనెక్కిన చంద్రబాబు అధినేతగా ఉన్న పార్టీలో ఉన్న రామ్మోహన్ నాయుడుకి…ఏం తెలుసు చరిత్ర గురించి అని ఎద్దేవా చేస్తున్నారు. ఆయనిప్పుడు విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు…? దాన్నేమంటారు..? తన పార్టీ తప్పులను, తన పార్టీ అధినేత చేసిన నమ్మక ద్రోహాన్ని ఇతరులు మీదకు నెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమే కదా అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

రామ్మోహన్నాయుడు ట్విట్లు చూస్తే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉంద‌ని, సొంత మామకు వెన్నుపోటు పోడవడంలో సిద్ధస్తులైన చంద్రబాబును రామ్మోహన్ నాయుడు అడగాలని హిత‌వు ప‌లికారు. అంతేతప్ప తమ పార్టీ అధినేత దుర్భుద్ది ఇతరులకు ఉంటుందనుకోవడం రామ్మోహన్ నాయుడు అమాయకత్వమ‌ని వైసిపి శ్రేణులు విమ‌ర్శిస్తున్నారు.

టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ ఆవేదనలు, తనకు జరిగిన అన్యాయం, చంద్రబాబు కుట్రలు ఇప్పటికీ ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉన్నాయని రామ్మోహన్ నాయుడుకి తెలియదా…? తెలియకపోతే ఒకసారి తెలుసుకో చంద్రబాబు నమ్మక ద్రోహం ఎన్టీఆర్ మాటల్లోనే విను అంటూ రామ్మోహన్ నాయుడుకి సూచించారు.

సీనియర్లు అందరూ పాలన చూసి ఛీ కొడుతున్నారంటూ రామ్మోహన్ చేసిన వ్యాఖ్యపై వైసిపి శ్రేణులు విరుచుకుప‌డుతున్నారు. ఎక్కడా అలా లేదే…ఏమో అయితే ఎల్లో మీడియాలో వస్తుందేమో…కాని రాష్ట్రం వైసిపి సీనియర్లంతా వైఎస్ జగన్ పాలనకు మద్దతుగా నిలుస్తున్నారని స్ప‌ష్టం చేశారు.

కానీ మీ టిడిపి సీనియర్ నేతలులా వైసిపి సీనియ‌ర్లు రాజీనామాలు చేసి వెళ్లిపోలేదని, చంద్రబాబు వైఖరితో విసుగెత్తి చాలా మంది సీనియర్లు టిడిపి రాజీనామాలు చేశార‌ని విమర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అయితే తన స్వ లాభం కోసం కొంత మంది సీనియర్ ఎంపిలను చంద్రబాబే బిజెపిలోకి పంపించారని, ఇది మీకు తెలియదా అంటూ రామ్మోహ‌న్ నాయుడుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ మాటకొచ్చే సీనియర్లే కాదు…జూనియర్లు కూడా టిడిపికి రాజీనామా చేస్తున్నారని, మీ పార్టీ లోపాలను ఇతర పార్టీలకు అన్వయిస్తే ఎలా అంటూ రామ్మోహ‌న్‌పై ధ్వ‌జ‌మెత్తారు.

ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదని రామ్మోహన్ నాయుడు చేసిన మరో వ్యాఖ్యపై వైసిపి శ్రేణులు మండిప‌డుతున్నారు. గత ఐదేళ్లు మీరేం చేశారని, బిజెపితో కలిసే ఉన్నారుగా…కేంద్ర ప్రభుత్వంలో మంత్రులై ఉన్నారుగా ఆ ఐదేళ్లు ఏం చేశారని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. పెద్ద గుర్రాలకు పళ్లుతోమారా..? అంటూ మండిప‌డుతున్నారు. ఎన్నికల కోసం వాల్తేరు డివిజన్ లేకుండా విధి విధానాలు సరిగాలేని మొక్కుబడి జోన్ ను కేంద్రం ఇచ్చింద‌ని, దీనిపై ఇప్పటికి అనేక సార్లు వైసిపి పార్లమెంట్ నేత విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో లేవనెత్తారని, కేంద్ర రైల్వే మంత్రి కి లేఖలు రాశారని అది మీకు తెలియదా? అంటూ రామ్మోహ‌న్ నాయుడుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

“ఏడాదిలో మామ, అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు” అని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ చేసిన ట్విట్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కనీస అవగాహన లేకుండా ఈ వ్యాఖ్య చేశారని, ఎందుకంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య ఆంధ్ర మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందలనే ల‌క్ష్యంతో రాజధాని మూడు ప్రాంతాలకు తరలించేందుకు సిఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సిఎం జగన్ కృషి చేస్తున్నారని, అది ప్రజలనడిగితే చెబుతారని హిత‌వు ప‌లికారు.

కాళ్లు మొక్కడం, ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పని‌చేయాలని రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్య‌పై ధ్వ‌జ‌మెత్తారు. ప్రధాని మోడీ కాళ్ళుపై పడిందెవరో అందరికి తెలుసని, మోడీ కాళ్లను పట్టుకున్నది చంద్రబాబు కాదా..? అని ప్ర‌శ్నించారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని తెలిపారు. సిఎం వైఎస్ జగన్ కాని, విజయసాయి రెడ్డి కాని ఎక్కడా ప్రధాని మోడీ కళ్లుమీద పడలేదని, అది కాస్తా తెలుసుకోవాల‌ని రామ్మోహ‌న్ నాయుడుకి హిత‌వు ప‌లికారు.

ట్విట్టర్లో రెచ్చిపోవడం మానాలని ముందు మీ లోకేష్ బాబుకు చెప్పాల‌ని, ఆయన ట్విట్లతో వైసిపి నేతలు‌ భయపడుతున్నారని ఆయనే స్వయానా మీడియా సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. మీ అధినేత చంద్రబాబు తనయుడు కనుక నీవు చెప్పలేవనుకో, ఒకవేళ చెబితే నీకు వేటు తప్పదనుకో అని ఎద్దేవా చేశారు.