బడా నిర్మాతలూ – సైలెన్స్ వీడండి

మూడు నెలలకు పైగా ఎదురు చూస్తున్న సుముహూర్తం వచ్చేసింది. థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. నిజానికి 23 నుంచే పూర్తి స్థాయి అనుమతులు వచ్చినప్పటికీ నిర్మాతలు పూర్తి సంసిద్ధతతో లేకపోవడం ఏవో రెండు డబ్బింగ్ సినిమాలను మొక్కుబడిగా రిలీజ్ చేశారు తప్ప వాటికి జనం వచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. అసలు సందడి 30 నుంచి ప్రారంభం కాబోతోంది. సత్యదేవ్ తిమ్మరుసు, తేజ సజ్జ ఇష్క్ లు బిగ్ స్క్రీన్ పై బోణీ కొట్టబోతున్నాయి. నైజామ్ లో అందులోనూ హైదరాబాద్ లో ఇప్పటికే థియేటర్ల లిస్టులు ప్రకటించేశారు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ తో పాటు ప్రధానమైన మల్టీ ప్లెక్సులన్నీ వీటితోనే పునఃప్రారంభం కాబోతున్నాయి.

బాగుంది. ఇక అంతా శుభమే అనుకోవాలి. కానీ ఈ ఒక్క 30కే అద్భుతాలేమీ జరిగిపోవు. ఎందుకంటే పైన ఇద్దరు హీరోలు భారీ ఓపెనింగ్స్ తెచ్చే క్రౌడ్ పుల్లర్స్ కాదు. టాక్ చాలా కీలకం. కరోనా థర్డ్ వేవ్ భయాలు ముసురుకున్న తరుణంలో జనాన్ని థియేటర్ల దాకా రప్పించాలంటే పబ్లిసిటీ కంటే ఎక్కువ కంటెంట్ మాట్లాడాలి. సరే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కాబట్టి ఈ రెండు చిత్రాలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. అయితే ఇది సరిపోదు. పెద్ద సినిమాలు మౌనం వీడాలి. ఇప్పటికైతే ఆగస్ట్ 6కి సైతం మీడియం సినిమాలనే షెడ్యూల్ చేశారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక్కటే అంతో ఇంతో హైప్ ఉన్నది.

ఇక బడా నిర్మాతలు సైలెన్స్ వీడాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ కాపీలతో సిద్ధంగా ఉన్న లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, పాగల్ లాంటివి తమ రిలీజ్ డేట్లను కాన్ఫిడెంట్ గా ప్రకటించాలి. అది చేస్తే ప్రమోషన్ కు తగినంత సమయం దొరుకుతుంది. ప్రేక్షకులను సిద్ధం చేయడానికి ఈవెంట్లు గట్రా చేసుకోవచ్చు. కానీ జూలై పూర్తవడానికి వస్తున్నా కూడా ఆగస్ట్ రెండో వారం నుంచి ఏ సినిమాలు వస్తాయో కనీస క్లారిటీ లేదు. ఇంకా వేసి చూసే ధోరణిని నిర్మాతలు అనుసరించడం మంచిది కాదు. భయంతో జనం థియేటర్లకు రారన్న ప్రశ్నే లేదు. కాకపోతే కాస్త పేరున్న ఇమేజ్ ఉన్న హీరో అయితే అందరికీ ధైర్యం వస్తుంది. అదెవరు చేస్తారు

Also Read: సాహో రేంజ్ లో టైగర్ ఖర్చు

Show comments