iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ ను కదిలించిన వైజాగ్ ఉదంతం

  • Published May 07, 2020 | 10:15 AM Updated Updated May 07, 2020 | 10:15 AM
టాలీవుడ్ ను కదిలించిన వైజాగ్ ఉదంతం

ఇవాళ ఉదయం లేవగానే టీవీలు చూసిన ప్రతి ఒక్కరికి ఊహించని రీతిలో వైజాగ్ గ్యాస్ లీక్ తాలూకు విషాదం పెద్ద షాక్ ఇచ్చింది. ఒకపక్క కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే కాలం గడుపుతున్న సమయంలో ఇలా కీలకమైన ఒక నగరాన్ని కుదిపేసిన గ్యాస్ ఉదంతం టాలీవుడ్ స్టార్లను సైతం కదిలించింది. విశాఖపట్నం శివార్లలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జి పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి లీకైన విష వాయువు వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సత్వరం స్పందించడంతో పాటు అన్ని శాఖల అధికారులు వేగంగా ఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఉదంతం పట్ల మన తారలు స్పందించారు. చిరంజీవి. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మంచు మనోజ్, నిఖిల్, నాని, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్, లావణ్య త్రిపాటి, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, సాయి ధరమ్ తేజ్, అనిల్ రావిపూడి, బాబీ తదితరులు తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇది ఊహించని ఉత్పతమని, మరణించిన వారికి నివాళి అర్పిస్తూ చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమకు వైజాగ్ తో గొప్ప అనుబంధం ఉంది. గత ఎన్నో దశాబ్దాలుగా అక్కడ చాలా షూటింగులు జరిగాయి. ముఖ్యంగా ఆర్కె బీచ్ ఒడ్డున మెయిన్ రోడ్ లో దాదాపు స్టార్లలందరూ నటించిన బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఉన్నాయి.

గత కొనేళ్లుగా భద్రతా కారణాల దృష్ట్యా అనుమతులు ఇవ్వడం లేదు కానీ అక్కడి పరిసరాలు మన తారలకు సుపరిచితమే. అందుకే వైజాగ్ తాలూకు వార్త వినగానే స్పందించారు. మరికొందరి నుంచి సాయంత్రం ట్వీట్ల రూపంలో రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. కరోనా వల్ల షూటింగులు ఆగిపోయి విదేశాలకు వెళ్లే అవకాశాలు లేక ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అయిన తరుణంలో మంచి స్పాట్ అయిన వైజాగ్ గురించి ఇలాంటి వార్త రావడం షాకే. కాకపోతే ప్రమాద తీవ్రత తక్కువగానే ఉంది కాబట్టి కొద్దిరోజుల్లోనే అంతా నార్మల్ కావడం ఖాయం. అయితే అసలు గండమైన కరోనా నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి