iDreamPost
android-app
ios-app

2023 – సరికొత్త ఆశలతో టాలీవుడ్ స్వాగతం

  • Published Dec 31, 2022 | 6:02 PM Updated Updated Dec 31, 2022 | 6:02 PM
2023 – సరికొత్త ఆశలతో టాలీవుడ్ స్వాగతం

కరోనా మహమ్మారి చేసిన గాయాల నుంచి పూర్తిగా బయటపడి సినిమా సత్తా ఏంటో దేశానికే కాదు ప్రపంచానికి చాటిన సంవత్సరంగా 2022 టాలీవుడ్ కు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. దారుణమైన డిజాస్టర్లు ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గడపకు, కార్తికేయ 2తో ఢిల్లీ ముంబై ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. సీతారామం, బింబిసారలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర చోట్ల సైతం మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 2023 వచ్చేసింది. వందలు కాదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన సినిమా స్థాయి ఏంటో చూపించడానికి రంగం సిద్ధమవుతోంది. కొత్త వైరస్ తాలూకు భయాలు ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికమేననే నమ్మకంతో ఉంది

కొత్త సంవత్సరంలో ప్యాన్ ఇండియా సినిమాలు భారీ ఎత్తున సందడి చేయబోతున్నాయి. ప్రభాస్ ఆది పురుష్, సలార్ రెండూ తక్కువ గ్యాప్ లో అలరించబోతున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు బడ్జెట్ ప్లస్ కంటెంట్ మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన తేజ సజ్జ హనుమాన్ కోసం ఇంకా ట్రైలర్ రాకుండానే డిమాండ్ ఏర్పడటం శుభ సూచకం. అగ్ర హీరోల్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య – భోళా శంకర్, బాలకృష్ణ వీరసింహారెడ్డి – అనిల్ రావిపూడి సినిమాలతో ఇద్దరూ డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నారు. నాగార్జున 100వ సినిమా, వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రాలు ఇదే ఏడాది రానుండటం విశేషం

మహేష్ బాబు త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ, కళ్యాణ్ రామ్ అమిగోస్ – డెవిల్, రవితేజ రావణాసుర – ఈగల్ – టైగర్ నాగేశ్వరావు, నిఖిల్ కార్తికేయ 3 – స్పై, అల్లు అర్జున్ పుష్ప 2, న్యాచురల్ స్టార్ దసరా – నాని 30, అడవి శేష్ గూఢచారి 2, విజయ్ దేవరకొండ ఖుషీ, కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ – రూల్స్ రంజన్ – మీటర్ వగైరాలన్నీ 2023లోనే వచ్చేస్తున్నాయి. ఇంకా షూటింగ్ మొదలుకావాల్సినవి, ప్రతిపాదన నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చూస్తుంటే గడిచిపోయిన గతం కంటే రాబోయే కాలం ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తోంది. విజయాల శాతం ఇంకా పెరిగితే ఇండస్ట్రీకి అంతకన్నా కావాల్సింది ఏముంది