iDreamPost
iDreamPost
ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో మలయాళం హిట్ సినిమాల రీమేకుల కోసం పోటీ పెరిగిపోయింది. అక్కడి నేటివిటీని దృష్టిలో పెట్టుకున్న వాటిని కూడా పోటీ పడి మరీ కొంటున్నారు. సత్య దేవ్ లాంటి చిన్న హీరోతో మొదలుకుని మెగాస్టార్ చిరంజీవి దాకా అందరూ ఇదే బాట పడుతున్నారు. మాములుగా అయితే మలయాళంలో ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినా నిన్నా మొన్నటి వరకు మహా అయితే 50 లక్షల లోపే రేట్ ఉండేది. చిన్న హీరో అయితే ఆ మొత్తాన్ని చెప్పకపోవడం బెటర్. ఏదో దృశ్యం లాంటివి కాస్త ఎక్కువ ధర పలుకుతాయి అంతే. కానీ లూసిఫర్ కోసం ఏకంగా 1 కోటి 50 లక్షలు వెచ్చించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఇక్కడి ప్రేక్షకులు బాగానే చూసేశారు. మనవాళ్లకు ఇది కనెక్ట్ అవుతుందా అనే అనుమానాలు కూడా జోరుగా ఉన్నాయి. అయితే దర్శకుడు సుజిత్ చాలా మార్పులు చేస్తున్నట్టు ఇప్పటికే వార్త ఉంది. దీని సంగతలా ఉంచితే అయ్యప్పనుం కోషియంను కూడా ఎనభై లక్షల దాకా పెట్టుబడి పోసి కొన్నట్టు టాక్ ఉంది. ఇది రవితేజ-రానాల కాంబోలో తెరకెక్కుతుందని ఇప్పటికే న్యూస్ ఉంది. దర్శకుడి పేరు గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కేరళ వాతావరణం అక్కడి ప్రజల అభిరుచులు వేరు. దాని తగ్గట్టు అక్కడి రైటర్లు కథలు రాసుకుంటారు. రెగ్యులర్ గా వీటిని చూసే తెలుగువాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. కొన్నేళ్ల క్రితం ప్రేమమ్ అక్కడ చరిత్ర సృష్టించినప్పుడు ఇక్కడ అంత కన్నా భారీగా ఆడుతుందనుకున్నారు అందరూ. కానీ చైతు ఇమేజ్, కథలో ఫ్రెష్ నెస్ వల్ల హిట్ అయ్యింది కానీ ఒరిజినల్ వెర్షన్ రేంజ్ కు మాత్రం చేరుకోలేదు.
వెంకటేష్ దృశ్యం సైతం భారీ లాభాలు ఇవ్వలేదు. అదే అక్కడ ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పింది. ఇవన్నీ కాస్త ఎక్కువ ధర పెట్టి కొన్నవే. ఇప్పుడు ప్రతి హిట్టు సినిమాను ఇలా కొనేసుకుంటూ పోతే రేపు ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్ ఏదైనా వస్తే రెండు కోట్లు చెప్పినా ఆశ్చర్యం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ సైతం 60 లక్షలకు పైగా ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు కొన్నారని వినికిడి. దీని కోసం రెండు అగ్ర నిర్మాణ సంస్థలు ఎనభై లక్షల దాకా ఆఫర్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. మొత్తానికి కేరళ ఫిలిం మేకర్స్ కు రాను రాను మన టాలీవుడ్ నిర్మాతలు బంగారు బాతులా మారుతున్నారన్న మాట వాస్తవం. ఒకప్పుడు తమిళ్ సినిమాలు మాత్రమే ఎక్కువగా రీమేక్ చేసుకునే మనవాళ్ళు ఇప్పుడు మల్లు వుడ్ వెంట పడటం గమనార్హం. రాబోయే పరిణామాలుఇంకెక్కడికి దారి తీస్తాయో మరి.