iDreamPost
android-app
ios-app

ఆక్రమించాలని బీజేపీ.. నిలువరించాలని టీడీపీ..

ఆక్రమించాలని బీజేపీ.. నిలువరించాలని టీడీపీ..

కరోనా వల్ల తిరుపతి లోక్‌సభ వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట ఉప ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల పెద్ద మార్పులు ఏమీ చోటు చేసుకోవు. ప్రత్యేమైన పరిస్థితులలోనే కొన్ని చోట్ల ఉప ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. ప్రస్తుతం ఏపీలో జరగబోయే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గడచిన సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజం పాలైన టీడీపీ.. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం కోసం అడుగులు వేయాలనుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా, అధికారం చేపట్టే దిశగా ఏపీలో బలపడాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. తిరుపతి ఉప ఎన్నికను మంచి అవకాశంగా మలుచుకోవాలని భావిస్తోంది.

రెండో స్థానం కోసం వారి మధ్య పోటీ..

గత ఎన్నికల్లో వైసీపీ తిరుపతి నంచి భారీ మెజారిటీతో గెలిచింది. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌పాలన తర్వాత.. ఆ పార్టీ మరింత బలపడింది. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని అందరూ అంచనాకు వచ్చారు. వైసీపీ కూడా నిమ్మలంగా ఉంది. అయితే బీజేపీ, టీడీపీలు తిరుపతి ఉప ఎన్నికపై ఎందుకు ఇంత ఆరాటం చూపిస్తున్నాయనేందుకు బలమైన కారణం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది. ఆ స్థానంలోకి రావాలని బీజేపీ ప్లాన్‌ వేస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిస్తే.. టీడీపీ పరిస్థితి తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా తయారవుతుంది. టీడీపీ నేతలు బీజేపీలోకి క్యూ కడతారు. టీడీపీ పుట్టి మునుగుతుంది. వసలు ఆపడం ఎవరి తరమూ కాదు. అదే టీడీపీ రెండో స్థానంలో నిలిస్తే.. చంద్రబాబు ఊపిరి పీల్చుకుంటారు. వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పేందుకు, బీజేపీ తన పార్టీని ఏమీ చేయలేదని చాటేందుకు బాబుకు అవకాశం లభిస్తుంది. ఇటీవల ఎన్‌టీఆర్‌ వర్థంతి సందర్భంగా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను.. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం ద్వారా నిజమని చాటవచ్చు.

మొదలైన కోళాహళం..

తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్‌ రాక ముందే.. బీజేపీ, టీడీపీలు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాయి. టీడీపీ అభ్యర్థిని ప్రకటించగా.. బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తరచూ తిరుపతి లోక్‌సభ పరిధిలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన తిరుపతి కపిలతీర్థం నుంచి విజయనగరం రామతీర్థం వరకూ వారం పది రోజుల పాటు యాత్ర చేయాలని బీజేపీ నిర్ణయించింది. అనుమతి కోసం పోలీసులకు లేఖ రాసింది. బీజేపీ ప్రకటన రాగానే.. టీడీపీ కూడా యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించింది. ధర్మ పరిరక్షణ పేరుతో చేసే ఈ యాత్ర కేవలం తిరుపతి లోక్‌సభ పరిధికే పరిమితం చేసింది. ఉప ఎన్నికలే లక్ష్యంగా.. ఈ రోజు గురువారం నుంచి యాత్ర ప్రారంభించబోతోంది. లోక్‌సభ పరిధిలోని 700 గ్రామాల్లో 70 వాహనాల ద్వారా పది రోజుల పాటు టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర సాగనుంది. «మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాను టీడీపీ ఫోకస్‌ చేయడానికి ప్రధాన కారణం బీజేపీని నిలువరించడమే. అందుకే ధర్మ పరిరక్షణ అనే పేరుతో తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించబోతోంది. హిందుత్వమే ఎజెండాగా తిరుపతి ఎన్నికలకు పని చేస్తున్న బీజేపీ, టీడీపీలు.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాయా..? లేదా..? తేలాలంటే ఉప ఎన్నిక పూర్తి కావాలి.