తిరుప‌తి బై పోల్ : మ‌మా అనిపించారు..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తున్నాయంటే.. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌పై అంచ‌నాలు పెరిగాయి. ప‌వ‌న్ చ‌‌రిస్మా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గాలితో గ‌ట్టి పోటీ ఖాయ‌మ‌ని అంతా భావించారు. పొత్తులో భాగంగా రెండు పార్టీలూ ప్ర‌చారంలో ఎంత‌లా అద‌ర‌గొడ‌తాయోన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా ఎదురుచూశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల్లో క‌లియ‌తిరిగి బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌చారానికి ఓ ఊపు తెస్తార‌ని అటు బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్ప‌డింది.

కానీ మొత్తంగా బీజేపీ – జ‌న‌సేన కూట‌మి ప్ర‌చార‌శైలిని ప‌రిశీలిస్తే ఐక్య‌మ‌త్యం పెద్ద‌గా లేన‌ట్లే క‌నిపిస్తోంది. బీజేపీ యే దూరం పెడుతుంద‌ని స్థానిక జ‌న‌సైనికులు, కొన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌న‌సేన‌కే మ‌న‌స్ఫూర్తిగా ఇష్టం లేద‌ని కాషాయ‌నేత‌లు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ వ‌చ్చారు. కార‌ణాలేఏవైనా ఓ ప్ర‌క‌ట‌న‌.. ఓ స‌భ‌.. ఒక‌టి రెండు ప్రెస్ మీట్ల‌తో పొత్తు ప్ర‌చారాన్ని ఇరు పార్టీల నేత‌లూ మ‌మా అనిపించిన‌ట్లుగా ఉంది.

తిరుప‌తిలో బీజేపీ- జ‌న‌సేన పొత్తు ప్ర‌చారం విచిత్ర‌మైన రీతిలో కొన‌సాగింది. పేరుకే పొత్తు త‌ప్పా ప్ర‌చారంలో పెద్ద‌గా కాషాయం, జ‌న‌సేన జెండాలు రెప‌రెప‌లు పెద్ద‌గా క‌నిపించ లేదు. అభ్య‌ర్థి ఎంపిక నుంచే ఆ రెండు పార్టీల శ్రేణుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు క‌నిపిస్తూ వచ్చాయి. తామే ఇక్క‌డ పోటీ చేస్తామని జ‌న సైనికులు మొద‌టి నుంచీ ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లోనూ, జ‌న‌సేన స‌మావేశాల్లోనూ వారు ఇదే అభిప్రాయాన్ని గ‌ట్టిగానే చెప్పారు.

Also Read : తిరుపతిలో బిజెపి తుది ఎత్తుగడ..!

బీజేపీ అధిష్ఠానం అందుకు అంగీక‌రించ‌లేదో, జ‌న‌సేనానికే ఇష్టం లేదో తెలీదు కానీ, బీజేపీయే పోటీ చేస్తుంద‌ని అర్థ‌మైపోయింది. అయితే, అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ‌ను ప్ర‌క‌టించి ఆమెను వెంటబెట్టుకుని సోము వీర్రాజు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిశాక గానీ, జ‌న‌సేన నుంచి బీజేపీ అభ్య‌ర్థిని బ‌ల‌ప‌రుస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న రాలేదు. అనంత‌రం కొద్ది రోజుల త‌ర్వాత జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం, ఆ త‌ర్వాత ఆ పార్టీ ముఖ్య నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి ఒక‌ట్రెండు ప్రెస్‌మీట్లు త‌ప్ప…మ‌రెలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేదు. త‌మ‌ను బీజేపీ నేత‌లు ప్ర‌చారానికే పిలవ‌లేద‌నేది క్షేత్ర‌స్థాయిలోని జ‌న‌సేన శ్రేణులు, నాయ‌కుల అభిప్రాయం వ్య‌క్తం చేసేవారు.

దీనిపై మీడియాలో కూడా ప‌లు ర‌కాల క‌థ‌నాలు వెల్లువెత్తాయి. జ‌న‌సేన -బీజేపీ మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం క‌నిపిస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో మాత్రం తాము క‌లిసే ఉన్న‌ట్లుగా రెండు పార్టీల హ‌డావుడి క‌నిపించేది. మిగిలిన సంద‌ర్భాల్లో మాత్రం ఎవ‌రికి వారే య‌మునా తీరు అన్న చందంగా బీజేపీ -జ‌న‌సేన శ్రేణుల మ‌ధ్య సంబంధాలున్నాయ‌నే వాద‌న లేక‌పోలేదు.దీంతో బీజేపీ అగ్ర‌నేత‌లు మాత్రం జ‌న‌సేన‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నామ‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. కానీ జ‌న‌సేన నుంచి అలాంటి మాటే రాదు. ఎందుకంటే జ‌న‌సేన‌ను బీజేపీ అంత‌గా క‌లుపుకు పోలేద‌ని జ‌న‌సైనికుల అభిప్రాయంగా ఉంది.

జేపీ న‌డ్డా తో పాటు ప‌వ‌న్ ప్ర‌చారంలో పాల్గొంటే ఆ రెండు పార్టీల మ‌ధ్య బంధానికి మంచి నిద‌ర్శ‌నం క‌నిపిస్తుంద‌ని అంతా ఎదురుచూసినా క‌రోనా దానికి అడ్డం ప‌డింది. క్వారంటైన్ లో ఉండ‌డంతో ప‌వ‌న్ ప్ర‌చారంలోకి రావ‌డం లేద‌ని జ‌న‌సేన వెల్ల‌డించింది. ఇలా కార‌ణాలు ఏమైనా బీజేపీ – జ‌న‌సేన ఐక్యంగా, గ‌ట్టిగా తిరుప‌తిలో పోరాడింది ఏమీ లేద‌నే విశ్లేష‌కుల అభిప్రాయం.

Also Read : ప్రచారం పేలవం.. ప్రమాణాల ప్రహసనం

Show comments