iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ వైద్యరంగం ప్రక్షాళనకు వేళయింది

  • Published Apr 08, 2020 | 5:37 AM Updated Updated Apr 08, 2020 | 5:37 AM
ప్రభుత్వ వైద్యరంగం ప్రక్షాళనకు వేళయింది

ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలవైపు ప్రజలు చూస్తుంటారు. ఇక్కడ కేంద్రమైనా, రాష్ట్రమైనా సరే. అవి చేపట్టే చర్యలు సామాన్య ప్రజానీకంలో తీవ్ర చర్చకునిలుస్తాయి. కరోనా లాంటి మహమ్మారులు దాడితో అతలాకుతలం అవుతున్నప్పుడు భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడే ప్రజానీకం ప్రతి అంశంలోనూ తీవ్రంగానే ప్రతిస్పందిస్తుంది.

ఒక రోజు జనతాకర్ఫూకు పిలుపునిస్తే ఇళ్ళ నుంచి బైటకు రాకుండా విజయవంతం చేసిన ప్రజలు, 21 రోజుల లాక్‌డౌన్‌ మొదటి వారం దాటగానే స్వల్పంగా ప్రారంభమైన ఉల్లంఘనలు కొన్ని చోట్ల కంట్రోల్‌ చేయలేని స్థాయికి చేరాయన్నది నిర్వివాదాంశం. ఇది యంత్రాంగా కావాలనే వదిలిన వెసులుబాటు కూడా కావొచ్చు. కానీ దీనికి మోడీ పిలుపే కారణమని ఆయన అభిమానులు కూడా చెప్పుకోవచ్చు. కానీ మహమ్మారుల దాడిలో అతలాకుతలం అవుతున్న రాష్ట్రాలను ఆదుకునేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం తీసుకునే చర్యల సారాన్ని ప్రజానీకం గమనిస్తోంది. గుమ్మంలో నిలబడి చప్పట్లు కొట్టండి అన్నప్పుడు ఆశావహదృక్పథంతోనే ఉన్న జనం, ఆ తర్వాత దీపాలు వెలిగించండి అంటే కూడా మద్ధతు తెలిపారు.

ఒక పక్క లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయన్నది సాక్షాత్తు ఆయా సీయంలే చెబుతున్న మాట. ఇందుకు నిదర్శనం తెలంగాణాలో ఉద్యోగుల జీతాల కోత విధిస్తే, ఆంధ్రాలో వాయిదాల పద్దతిలో ఇస్తామనడం. ఒక పక్క ఆదాయం రాకపోగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలను ఆదుకునేందుకు ఇస్తున్న సాయం రూపంలో ఎదురయ్యే ఖర్చులు వీటిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. కేంద్రం 15వేల కోట్లు ఇచ్చింది, గ్యాస్‌ సిలెండర్లు ఇస్తోంది, ఇతర ఆహార పథకాలకు వెచ్చిస్తోంది అని చెప్పొచ్చుగాక. ఇవన్నీ కూడా తాత్కాలిక ఉద్దీపనలే తప్పితే, రాష్ట్రాలను ఆర్ధిక గడ్డు పరిస్థితులనుంచి గట్టెక్కించేవి ఏ మాత్రం కాదన్నది నిర్వివాదాంశం.

ఎన్నికల హామీల నేపథ్యంలో ఇప్పటికే ఆర్ధిక భారాన్ని మోస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్యరంగాన్ని సమగ్రంగా ఉద్దరించేందుకు దీర్ఘకాలిక చర్యలు చేపడతాయనడం సందేహమే. ఇప్పటికే ప్రభుత్వ వైద్యం కేవలం తల్లీబిడ్డల వరకు మాత్రమే పరిమితమైపోయింది. గ్రామాల్లోనైతే సహజంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు గ్రామస్థాయిలోని సబ్‌సెంటర్లకు వచ్చేవారే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సదరు సిబ్బంది కేవలం టీకాలు వేయడానికి మాత్రమేనన్నది జనంలో నాటుకుపోయిన పరిస్థితి. దీంతో ప్రైవేటు వైద్యులను నమ్ముకుని ఇంటిని, ఒంటిని జనం గుల్లచేసుకోవాల్సి వస్తోంది.

అయితే ఇప్పుడు వచ్చిన మహమ్మారిలాంటి ముప్పు భవిష్యత్తులో ఎదురు కాదన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ఆమూలాగ్రం ప్రక్షాళన చేసి క్షేత్రస్థాయిలో సమగ్ర వైద్యం అందించేందుకు కేంద్రం ప్రణాళికలు ప్రకటించాల్సిన అవసరముంది. మళ్ళీ ఏదైనా ముప్పు ఇంతకంటే భారీగా ఎదురైతే అప్పుడేంటి అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.