స్వచ్చమైన ‘ప్రేమ’ జంట ఇది – Nostalgia

విక్టరీ వెంకటేష్ ఇప్పటి జనరేషన్ కి ఫ్యామిలీ మూవీస్ హీరోగానే తెలుసు కానీ కెరీర్ ప్రారంభంలో మంచి సెన్సిబుల్ చిత్రాలు కొన్ని చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రేమ. 1989లో రాజేశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ పై రామానాయుడు గారు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రత్యేకత స్వచ్ఛమైన ప్రేమను ఆవిష్కరించడం. సంగీతమే ప్రాణంగా బ్రతుకుతూ అందులోనే జీవితాన్ని స్థిరపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న పృథ్వి అనే కుర్రాడు, సరదాగా లైఫ్ ని గడుపుతూ అరమరికలు లేని మంచి మనసున్న మ్యాగీ అనే అమ్మాయి మధ్య ప్రేమను దర్శకుడు సురేష్ కృష్ణ డీల్ చేసిన తీరు వసూళ్ళనే కాదు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది .

ఇందులో ఇళయరాజా సంగీతం ప్రాణంగా నిలిచింది. యు ఆర్ మై హీరో, ఈనాడే ఏదో అయ్యింది లాంటి పాటలు ఇప్పటి ప్రేమ జంటలకు సైతం విపరీతంగా నచ్చే అద్భుతమైన మెలోడీలు. ఆత్రేయ సాహిత్యంలో రాజా స్వరపరిచిన ప్రియతమా నా హృదయమా ఎందరి గుండె లోతులను తాకిందో లెక్కే లేదు.

బాషా లాంటి కమర్షియల్ సినిమా తీసిన సురేష్ కృష్ణ అప్పటికి కొన్నేళ్ళ క్రితమే ప్రేమ లాంటి విజువల్ పోయెట్రీని ఇచ్చాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఈయనకు తెలుగులో ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ కాగా దర్శకుడిగా కెరీర్ లో రెండోది. ఆ తర్వాత సురేష్ సంస్థలో ఇంద్రుడు చంద్రుడు రూపంలో మరో బ్రేక్ అందుకున్నాడు.

వెంకీ యాక్టింగ్ నంది అవార్డు తీసుకొస్తే సహజంగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ తో రేవతి ఫుల్ మార్క్స్ కొట్టేసింది. మంజుల, గొల్లపూడి, కల్పన, పిఎల్ నారాయణ తదితరుల పాత్రలు ప్రేమకి బలాన్ని ఇచ్చాయి. తాగుడు అలవాటు ఉన్న సింగర్ గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. నేపధ్య సంగీతం కూడా ప్రేమకున్న మరో ప్రధాన ఆకర్షణ. దీన్నే సురేష్ బాబు హిందిలో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేస్తే అక్కడా హిట్ అయ్యింది. ఇన్నేళ్ళు దాటుతున్నా ఎలాంటి ముద్దులు, హద్దులు దాటిన బోల్డ్ సీన్స్ లాంటివేవి లేకుండా తీసిన ప్రేమ ఇప్పుడు చూసినా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే వెంకటేష్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ప్రేమ స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది

Show comments