iDreamPost
android-app
ios-app

Tit for Tat లాగా పాలన ఉండకూడదు

Tit for Tat లాగా పాలన ఉండకూడదు

“నీవు చెప్పేదానితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ విషయం చెప్పడానికి నీకున్న హక్కుని కాపాడడానికి నీతో కలిసి పోరాటం చేస్తాను” అని మూడు శతాబ్ధాల క్రితం ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టోయిర్ చెప్పిన మాటలు ప్రజాస్వామ్యానికి మూలస్థంభంలా ఉన్నాయి. అయితే చాలాసార్లు వ్యవస్థ కన్నా నాయకుల వ్యక్తిగత భావనలే బలమైనప్పుడు భావ వ్యక్తీకరణకు కూడా అడ్డుకట్టలు పడుతుంటాయి.

విశాఖపట్నంలో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ పర్యటనకు వచ్చిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుని విమానాశ్రయం నుంచే తిప్పి పంపిన ఘటనకు ప్రతీకారంగా జరిగింది అని తెలుగుదేశం మద్దతుదారులతో పాటు కొందరు తటస్థులు కూడా భావిస్తున్నారు.

అయితే నిజానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ఖాళీ అయిపోయి పోరాటం చేయడం ఎలా అన్న పరిస్థితిలో విశాఖ సంఘటన ఆయనకో చిన్నదో చితకదో అస్త్రాన్ని అందించినట్లయింది.

అమరావతి పర ఉద్యమం ఆ చుట్టుపక్కల తప్ప రాష్ట్రంలో మరెక్కడా కదలిక కలిగించలేకపోయింది. ఆ ప్రాంతంలో కూడా ఆ ఉద్యమం రోజురోజుకూ బలహీనపడుతూ ఉంది కానీ బలమైన ప్రభావం చూపలేకపోయింది. ఇక ప్రజా చైతన్య యాత్ర అని చేపట్టిన బస్సు యాత్ర ప్రజల్లో అటుంచి పార్టీ కేడర్లో కూడా నీరసాన్ని నింపింది కానీ చైతన్యం కరిగించలేకపోవడంతో దాన్ని ఆపేద్దామా అని ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో చేపట్టిన విశాఖపట్నం యాత్రని అడ్డుకోకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కొన్ని ఆంక్షలు పెట్టి వదిలేసి ఉంటే అధికార పక్షానికి ప్రయోజనకరంగా ఉండేది.

విశాఖలో లెజిస్లేటివ్ రాజధాని వద్దు, రాజధానికి సంబంధించిన అన్ని విభాగాలు అమరావతిలోనే ఉండాలి అని చంద్రబాబు తన ఉపన్యాసాల్లో చెప్తే ఉత్తరాంధ్ర ప్రజల్లో పుట్టే వ్యతిరేక భావానని ఉత్తరాంధ్ర పరిరక్షణ పేరిట మరింత ఎగదోసి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచ వచ్చు. అలా కాకుండా అసలు ఆ టాపిక్ ఎత్తకుండా, విశాఖపట్నం నిర్మించింది, అభివృద్ధి చేసింది నేనే, హుదూద్ తుపానుకు చేతులు అడ్డుపెట్టి విశాఖను కాపాడింది నేనే అని స్వోత్కర్షకే పరిమితమైతే విశాఖపట్నం యాత్ర లక్ష్యమే నెరవేరకుండా పోతుంది.

అలా కాకుండా ఇప్పుడు తన యాత్రను అడ్డుకోవడం వలన తనని చూసి ప్రభుత్వం భయపడుతూ ఉందని అన్యాయంగా తనమీద దమనకాండ సాగిస్తోందని ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడుకి అవకాశం దొరికింది.