16 డిసెంబర్ 2012 భారత దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన అత్యాచార ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కదులుతున్న బస్సులో ఆరుగురు ఉన్మాదులు మద్యం మత్తులో సాగించిన ఆ ఘోర ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సంఘటన జరిగిన 13 రోజుల తరువాత మృత్యువుతో పోరాడుతూ నిర్భయ చనిపోయింది.
దీంతో హడావిడిగా నిర్భయ చట్టం తీసుకొచ్చారు. అత్యాచార చేసే నిందితులకు కఠిన(ఉరి)శిక్షలు విధించేలా చట్ట సవరణలు చేసారు. ఒకవేళ మైనర్లు అత్యాచార ఘటనలో పాలు పంచుకుంటే ఆ నేర తీవ్రతను బట్టి మైనర్లకు కూడా మూడేళ్లలోపు విధించాల్సిన శిక్షను కూడా మార్చి కఠిన శిక్షలు పడేలా నిర్భయ చట్టం తీసుకొచ్చారు. హడావిడిగా నిర్భయ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించి దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు.
Read Also: శిక్ష అమలయ్యేదెన్నడో…. ?
నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా దేశంలో అత్యాచార పర్వం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ తర్వాత గుడియా, అసిఫా,దిశా,సమతా, ఉన్నావ్ ఇలా దేశం మొత్తం ఉలిక్కిపడేలా, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా కొన్ని వేల అత్యాచారాలు జరిగాయి. కానీ వీరిలో ఒక్క దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయడం మినహా, మిగిలిన ఘటనల్లో సమతా నిందితులకు ఉరిశిక్ష,అసిఫా,ఉన్నావ్ ఘటనల్లో నిందితులకు జీవిత ఖైదు విధించగా,గుడియా నిందితులకు ఇంకా శిక్ష ఖరారు కాలేదు.
నిర్భయ నిందితుల విషయానికి వస్తే 2012 లో అత్యాచార ఘటన జరిగితే 2013 సెప్టెంబరు 13 న నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఇప్పటికీ ఇంకా ఉరిశిక్ష అమలుకాలేదు. ఇన్నేళ్ల పాటు ఉరి శిక్ష అమలు చేయకపోవడం మన చట్టాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుంది. నిందితులు కూడా తెలివిగా క్యూరేటివ్ క్షమాభిక్ష పిటిషన్లు వేస్తూ శిక్షను వాయిదా పడేలా చేస్తున్నారు.
Read Also: నిర్భయ రేపిస్టు కంటే డెంజర్
సరిగ్గా శిక్ష అమలయ్యే సమయానికి ఏదొక పిటిషన్ వేయడం దాంతో ఉరి శిక్ష అమలు ఆగిపోవడం ఇలా కొంతకాలంగా జరుగుతుంది. చట్టాల్లో ఉన్న లొసుగులు నిందితులకు వరాలుగా మారిపోయాయి. అందుకే నిర్భయ నిందితుల ఉరిశిక్ష నేడు డైలీ సీరియల్ ని తలపిస్తూ రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు ఇప్పట్లో శిక్ష అమలవుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ నిందితులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయని కాబట్టి ఉరి శిక్ష అమలుకు స్టే విధిస్తున్నామని ఢిల్లీ కోర్టు తీర్పు ఇవ్వడంతో మరొకసారి నిర్భయ దోషులకు శిక్ష వాయిదా పడింది.
దీంతో పేరుకేమో నిర్భయ చట్టం.. కానీ నిర్భయకు మాత్రం న్యాయం జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిందితులు అనేక ఎత్తులు వేస్తూ ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగేలా చేస్తున్నారని,కేంద్ర హోంశాఖ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నిర్భయ నిందితులకు శిక్ష అమలు కానివ్వనని ఆ నిందితుల తరపున లాయర్ బహిరంగంగా సవాల్ విసరడం చూస్తుంటే వాళ్ళెంత ధీమాగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. సంవత్సరాల తరబడి సాగే విచారణ, తారుమారయ్యే సాక్ష్యాలు, ఒకవేళ నేరం రుజువయ్యి శిక్ష పడినా అది ఎప్పటికి అమలవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఒకవేళ శిక్ష పడినా తప్పించుకోవచ్చనే ధైర్యంతో నేరాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.. మన దేశ న్యాయవ్యవస్థలో సమూలంగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే నేరాలు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం లేదు.
Read Also: ఇప్పట్లో నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలవుతుందా?
ఇటీవల ఉరిశిక్ష పడిన సమతా నిందితులు కూడా ఇలా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటే వారికి కూడా ఉరి శిక్ష అమలులో జాప్యం జరిగే అవకాశాలను కొట్టి పారేయలేము.దేశంలో పాతబడిన చట్టాలను దుమ్ము దులిపి వాటిని, నేటి కాలానికి సరిపడేలా సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా హైదరాబాద్ శివారులో జరిగిన దిశా అత్యాచార ఘటనతో చలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరం రుజువైన 21 రోజుల్లో ఉరి శిక్ష విధించేలా దిశా చట్టం తీసుకొచ్చింది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పరిస్థితుల్లో కొంతైనా మార్పు రావడానికి అవకాశం ఉంది.. దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు విధించడానికి నిర్భయ పేరుపై నిర్భయ చట్టాన్ని తీసుకువస్తే ఆ నిర్భయకే ఇంతవరకూ న్యాయం జరుగకపోవడం శోచనీయం..