ఉందిలే వింతలకాలం ముందుముందునా

సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు కానీ థియేటర్ల యజమానులు మాత్రం దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ హాల్ లో ఇప్పటికే సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా ఆల్రెడీ కెపాసిటీని సగానికి తగ్గించేశారు. వాటి తాలుకు ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు మల్టీప్లెక్సులు కొత్త సీటింగ్ ప్లాన్స్ తో తమ ప్రతిపాదనను ప్రభుత్వానికి ఇచ్చేశాయి. జూన్ 8 నుంచి అనుమతులు రావోచ్చనే ప్రచారం జరుగుతోంది కాని దేశంలో ఇంకా కంటైన్మెంట్ జోన్లు వందల్లో ఉన్నాయి.

అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్లు ఇవ్వరు. ముఖ్యంగా ముంబై, చెన్నై లాంటి నగరాల్లో తీవ్రత ఇంకా ఎక్కువే ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తెరుచుకోమని చెప్పినా అది ఎంతమేరకు ఫలితం ఇస్తుందన్నది అనుమానమే. సగం పైగా సీట్లు తగ్గించడం అంటే రెవెన్యూ కూడా అదే నిష్పత్తిలో పడిపోతుంది. ఒకవేళ టికెట్ రేట్లు పెంచి అమ్ముదామా అంటే జనం సగం భయంతో సగం డబ్బుల కరువుతో రావడం మానేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ముందు ఏ సినిమా విడుదల చేయాలి అనేది కూడా పెద్ద భేతాళ ప్రశ్నగా మారింది. ఒక్క తెలుగులోనే రెడీ టు రిలీజ్ పది దాకా ఉన్నాయి. ముందు ఏ నిర్మాత రెడీ అన్నా థియేట్రికల్ బిజినెస్ లో కోత వేసుకోక తప్పదు. ఎగ్జిబిటర్లు పాత రేట్లు కొనమని చెప్పేస్తారు.

డిస్ట్రిబ్యూటర్ల మీద ఇప్పటికే వడ్డీల భారం ఉంది. నిర్మాతల చేతుల్లో ఉన్న లీజు థియేటర్లు తప్ప ఇతర సింగల్ స్క్రీన్ ఓనర్లు అంత ఈజీగా కన్విన్స్ కారు. జనం రావడంలో ఏ మాత్రం తేడా జరిగినా అందరూ మునిగిపోతారు. అందుకే ఆచితూచి అడుగులు వేయక తప్పడం లేదు. టాలీవుడ్ వరకు చూసుకుంటే అటు ఓటిటి ప్రకటనలు కానీ థియేటర్లు తెరవగానే ముందు మా సినిమా రిలీజ్ చేస్తామని కానీ ఎవరూ చెప్పడం లేదు. దీన్ని బట్టి మనవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో అర్థమవుతుంది. రానున్న పది రోజుల్లో కొన్ని కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. అవి రిలీజ్ డేట్ల గురించా లేక ఓటిటి అనౌన్స్ మెంట్లా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కాని క్లారిటీ వచ్చేలా లేదు.

Show comments