Idream media
Idream media
బీసీసీఐ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిన్న మార్చి 29న ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమై క్రికెటర్లంతా మైదానంలో బిజీగా గడపాల్సిన సమయం ఇది. కానీ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించడంతో క్రికెటర్లందరూ కూడా తమ ఇళ్లలోనే స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.దీంతో అనుకోకుండా లభించిన విశ్రాంతి సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారు.గతవారం గబ్బర్ సింగ్ ఇంటిలో బట్టలు ఉతుకుతున్న వీడియోతో పాటు రెండు రోజుల క్రితం కోహ్లీకి అతని భార్య అనుష్క శర్మ ఇంట్లోనే హెయిర్‌కట్ చేస్తున్న వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చెయ్యగా అవి వైరల్ అయ్యాయి.
తాజాగా నిన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇంట్లో తన అన్న కృనాల్ పాండ్య,వదినతో కలిసి క్రికెట్ ఆడుతున్నా వీడియోని కృనాల్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.టెన్నిస్ బాల్‌తో హార్దిక్ పాండ్య బంతులు విసురుతుండగా కృనాల్ బ్యాటింగ్ చేశాడు.మూడవ బంతికి కృనాల్ ఔటైన వెంటనే తమ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ కరోనా వైరస్ కట్టడికి సహకరించడని పాండ్యా బ్రదర్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గత ఏడాది వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న తర్వాత తొలిసారిగా ఈనెల తొలి వారంలో డీవై పాటిల్ టీ20 కప్‌లో హార్దిక్ పాండ్యా మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో వరుసగా రెండు శతకాలు సాధించిన సంగతి తెలిసిందే.అన్నీ సవ్యంగా జరిగి ఉంటే నిన్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడే ముంబై ఇండియన్స్ తరపున పాండ్యా బ్రదర్స్ బరిలో దిగాల్సి ఉండేది.