గ్లామర్ ని ఓడించిన టాలెంట్ – Nostalgia

సినిమా పరిశ్రమలో అందం ఉంటేనే హీరోయిన్ కు మనుగడ అనుకుంటాం కానీ కేవలం టాలెంట్ తో కూడా నెగ్గుకురావొచ్చని నిరూపించే వాళ్ళు అరుదుగా ఉంటారు. స్కిన్ షో చేయకుండానే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వాళ్ళలో అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి జెనరేషన్ కు ఈమె ఎవరో తెలియదు కానీ 80 దశకంలో సినిమాలు చూసినవాళ్లకు సుపరిచితురాలే. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో ఆఫ్ బీట్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న అర్చన తెరంగేట్రం చేసింది మధురగీతంతో అయినా బ్రేక్ వచ్చింది మాత్రం ‘నిరీక్షణ’తోనే. బాలు మహేంద్ర దర్శకత్వంలో భానుచందర్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ఏళ్ళ తరబడి కోరుకున్నవాడి కోసం ఎదురు చూసే గిరిజన మహిళగా అద్బుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేశారు .

ఆ తర్వాత వంశీ డైరెక్షన్ లో వచ్చిన ‘లేడీస్ టైలర్’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘ఉక్కు సంకెళ్ళు’ పర్వాలేదు అనిపించుకుంది. 1988లో విడుదలైన ‘దాసీ’ అర్చనకు లైఫ్ టైం మెమరిగా నిలిచిపోయింది. బి నరసింగరావు దర్శకత్వం వహించిన దాసీతో అర్చన 36వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా పురస్కారం గెలుచుకుంది. ఆఫర్లు ఎన్ని వచ్చినా హీరోల పక్కన డాన్సులు చేస్తూ వెంటపడే పాత్రలు అంగీకరించని అర్చన ఇండస్ట్రీలో ఉన్నది కొంత కాలమే అయినా తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేశారు. 1991లో కోడి రామకృష్ణ రూపొందించిన ‘భారత్ బంద్’ అర్చనకు మరో మేలి మలుపు అని చెప్పొచ్చు.

ఆ తర్వాత సుమన్ తో ‘చక్రవ్యూహం’లో నటించినా అది ఆశించిన ఫలితం అందుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన అర్చన స్వతహాగా నృత్య కళాకారిణి. తనతో ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలని కొందరు దర్శకులు ప్రయత్నించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. మెరిసిపోయే బంగారం రంగు లేకపోయినా కళగల ముఖారవిందంతో ఆకట్టుకున్న అర్చన మళ్ళీ తర్వాత కంబ్యాక్ ఇవ్వలేదు. మంచి పాత్రలు వస్తే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా రీ ఎంట్రీ ఇవ్వాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. మరి ఆవిడ వాళ్ళ విన్నపాన్ని ఆలకిస్తారో లేదో.

Show comments