iDreamPost
android-app
ios-app

Horror Thriller : 3 భాషల్లో 300 రోజులు ఆడిన సినిమా – Nostalgia

  • Published Nov 18, 2021 | 11:21 AM Updated Updated Nov 18, 2021 | 11:21 AM
Horror Thriller : 3 భాషల్లో 300 రోజులు ఆడిన సినిమా – Nostalgia

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ చంద్రముఖి ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2005లో రిలీజైన ఈ సినిమాలో జ్యోతిక నటన, లకలక అంటూ వెరైటీగా ఇచ్చిన రజిని మ్యానరిజంస్, విద్యాసాగర్ పాటలు ఒకటా రెండా అన్ని అంశాలు మూకుమ్మడిగా పని చేసే దాన్ని ఇండస్ట్రీ హిట్ చేసేశాయి. అప్పట్లో తెలుగు వెర్షన్ సైతం వంద రోజులు ఆడిందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని లెక్కలేనన్ని కామెడీ హారర్లు, సస్పెన్స్ థ్రిల్లర్లు వచ్చాయి. దర్శకుడిగా పి వాసు పేరు పరిశ్రమలో మారుమ్రోగిపోయింది. అయితే దీని వెనుక చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి.

1993 మలయాళంలో ‘మణిచిత్రతజు’ వచ్చింది. మోహన్ లాల్ హీరోగా సురేష్ గోపి-శోభన జంటగా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీకి దర్శకుడు ఫాజిల్. 1992 నాగార్జునతో కిల్లర్ తీసింది ఈయనే. 19వ శతాబ్దంలో ఓ ట్రావెన్ కోర్ కుటుంబంలో జరిగిన ఓ విషాదం ఆధారంగా రచయిత మధు ముత్తం ఈ కథను తయారు చేశారు. అప్పటిదాకా అసలు పరిచయమే లేని ఒక కొత్త జానర్ ని ఫాజిల్ పరిచయం చేసేసరికి ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. క్లైమాక్స్ లో శోభన నటన వాళ్ళను అప్రతిభులను చేసింది. కట్ చేస్తే ఆ సంవత్సరం డిసెంబర్ లో రిలీజైన మణిచిత్రతాజు గొప్ప విజయాన్ని అందుకుంది. 300 రోజులకు పైగా ఆడి రికార్డులు సృష్టించింది. దీనికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. అప్పట్లోనే 3 కోట్లు వసూలు చేసింది.

కట్ చేస్తే 2004లో అంటే తొమ్మిదేళ్ల తర్వాత పి వాసు ఈ సినిమాని కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా సౌందర్య ప్రధాన పాత్రలో ‘ఆప్తమిత్ర’గా తీశారు. అక్కడా చరిత్ర సృష్టించింది. ఏకంగా ఏడాది ఆడేసింది. ఈ సినిమా చూసిన రజినీకాంత్ కు తెగనచ్చేసి వెంటనే రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కేవలం అయిదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి అద్భుతమైన అవుట్ ఫుట్ సిద్ధం చేశారు వాసు. దెబ్బకు పైన రెండు వెర్షన్ల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సక్సెస్ ని చంద్రముఖి సొంతం చేసుకుంది. చెన్నై శాంతి థియేటర్లో 890 రోజులు ఆడింది. శోభన-సౌందర్యలకు ధీటుగా జ్యోతిక కూడా తన పాత్రకు ప్రాణం పోశారు. లెక్కలేనన్ని అవార్డులు చంద్రముఖిని వరించాయి. 2005 ఏప్రిల్ 14న వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి ఆడి రజినికాంత్ కు గొప్ప బూస్టర్ గా పనిచేసి క్లాసిక్ గా నిలిచిపోయింది

Also Read : Khaidi Garu : హిట్ అయిన డబ్బింగ్ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తే – Nostalgia