iDreamPost
android-app
ios-app

1998లోనే విశాఖ పాలిమర్స్ లో తొలి ప్రమాదం

  • Published May 08, 2020 | 7:51 AM Updated Updated May 08, 2020 | 7:51 AM
1998లోనే విశాఖ పాలిమర్స్ లో తొలి ప్రమాదం

విశాఖపట్నంలో నిన్న జరిగిన పాలిమర్స్ కంపెనీపై ఇప్పటికే పోలీసు కేసు నమోదవ్వడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటి కూడా తన విచారణ కొనసాగించడానికి సిద్దమైంది. అయితే సుమారు 60ఏళ్ళ క్రితం స్థాపించిన ఈ సంస్థలో నిన్న జరిగిన ప్రమాదం కాకుండానే గతంలో కుడా లీకేజ్ ఘటన ఒకటి నమోదయినట్టు తెలుస్తుంది.

ఈ ఫ్యాక్టరీ నేపథ్యం చూస్తే విశాఖలో 1961 లో ఏర్పాటైన హిందుస్తాన్ పాలిమర్స్ ని 1978 వచ్చేసరికి యుబి గ్రూప్ కి చెందిన మెక్డోవెల్ కంపెనీ సొంతం చేసుకుంది.  19ఏళ్ళ పాటు నిర్విరామంగా నడిచిన ఈ సంస్థను 1997లో దక్షిణ కొరియా కి చెందిన ఎ.జీ కెమికల్స్ కొనుగోలు చేసి ఈ ఫ్యాక్టరీకి ఎల్ జీ పాలిమర్స్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ గా పేరు మార్చారు.

అయితే ఈ సంస్థ టేకోవర్ చేసిన సరిగ్గా సంవత్సరానికే 1998లో ఈ పాలిమర్స్ ఫ్యాక్టరీలోనే ఒకసారి అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. నాడు ఇదే ఫ్యాక్టరీలోనే గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగడంతో కొంత మంది తీవ్రంగా గాయపడ్డారని, దీంతో అక్కడ ప్రజలు నాడే ఈ సంస్థను పూర్తిగా తమ నివాసాల మధ్యనుండి తరలించాలని ఆందోళన చేపట్టారు. దీంతో నాడు అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగి  చొరవ తీసుకుని గ్రామస్తులతో మాట్లాడి వివాదం సద్దుమనిగేలా చేశారని చెబుతున్నారు.

ఈ ఘటన జరిగిన సరిగ్గా 22 ఏళ్ల తరువాత అంతా బాగుంది అనుకున్న ఈ సమయంలో గ్యాస్ లీక్ అయి మరోసారి ప్రమాదం జరిగి 12 మంది  బలి అవ్వడంతో పాటు వందలమంది అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఫ్యాక్టరీ జనావాసాలా మధ్య ఉండటం అంత సురక్షితం కాదు అనే చర్చ మళ్ళీ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ ప్రమాద ఘటనపై కమిటీ వేసినట్టు ఆ నివేదిక వచ్చిన తరువాత ఫ్యాక్టరీని జనవాసాల మధ్య నుంచి తరలించే ఆలోచన కూడా చేస్తామని చెప్పుకొచ్చారు. 1998 లో ఒకసారి ఇప్పుడు మరొకసారి జరిగిన సంఘటనల దృష్ట్యా ఈ ఫ్యాక్టరీని ప్రజల నివాసాల మధ్య నుండి తరలించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకుల మాట.