గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ ఎత్తివేత.. కరోనా పై పోరు నిరంతరం.. భవిష్యత్ లో వైరస్ తో కలసి జీవించాలి.. సీఎం వైయస్ జగన్

కరోనా పై మనం నిరంతరం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ లో కరోనా తో కలిసి జీవించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆందోళన లేకుండా లక్షణాలు వచ్చిన వారు చికిత్స కోసం ముందుకు రావాలన్నారు. ఇది వస్తే.. ఎదో అంటరాని వారిమనే భావన మనసులో నుంచి తీసేయలన్నారు. భవిష్యత్ లోనూ కొత్త కేసులు వస్తాయని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా ఆరికట్టడం సాధ్యం కాదన్నారు. రేపు నాకు వచ్చినా.. ఆశ్చర్యం లేదన్నారు. చికిత్స తీసుకుంటే కరోనా తగ్గిపోతుందని, ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.

దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కొద్దిసేపటికి క్రితం ఆయన మీడియా తో మాట్లాడారు. ప్రతి లక్ష మందికి 1396 టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు. 676 మండలాలకు గాను 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్ లలో, 54 మండలాలు ఆరంజ్ జోన్ లో ఉన్నాయని చెప్పారు. మిగిలిన 559 గ్రీన్ జోన్ లో ఉన్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దాదాపు 80 శాతం పైచిలుకు రాష్ట్రంలో ఎలాంటి కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్ష నిర్వహించామని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ఒక్క సౌకర్యం ఈ నెల రోజుల్లో సమకూర్చుకున్నామని సీఎం జగన్ తెలిపారు. కరోనా సంబంధిత వైద్యులు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లను పూర్తిస్థాయిలో భర్తీ చేశామని సీఎం జగన్ తెలిపారు. మిగతా వ్యాధులకు సంబంధించి డాక్టర్లు, ఇతర సిబ్బందిని మే 15 నాటికి భర్తీ చేస్తామని తెలిపారు. నెల రోజుల్లో వ్యవస్థ ను మరింత పటిష్టం చేశామని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ లేదా హార్డ్ ఇమ్యూనిటీ పెరగడం వల్ల మాత్రమే కరోనా ను అరికట్టగలమని సీఎం జగన్ పేర్కొన్నారు. అప్పటి వరకు కరోనా పై పోరు తప్పదని పేర్కొన్నారు. కరోనా అంటే ఏదో అంటారని వ్యాధి అని భవిస్తూ.. అది సోకిన వారిపై వివక్ష చూపరాదన్నారు. రేపు అదే పరిస్థితి మనకు వచ్చే అవకాశం ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. వయసు పైబడిన వారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతుందని చెప్పారు. ముందు రెడ్ జోన్ ఆ తర్వాత ఆరెంజ్ లోని ప్రజలకు చివరగా గ్రీన్ జోన్ లలో పంపిణీ చేస్తామని చెప్పారు.

మే 3 తర్వాత రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో యధావిధిగా కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సీఎం జగన్ చెప్పారు. రెడ్ జోన్లు ఆరెంజ్ జోన్ లలో ప్రస్తుతం ఆంక్షలు కొనసాగించక తప్పని పరిస్థితి అని చెప్పారు. వైరస్ అదుపులోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఆయా ప్రాంతాలలో ఆంక్షలు సడలించే పరిస్థితి వస్తుందన్నారు. గ్రీన్ జోన్ లోని ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఎం జగన్ సూచించారు. అప్పుడే కరోనా మన దగ్గరకు రాకుండా ఉంటుందని పేర్కొన్నారు. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బంది… ప్రతి ఒక్కరికి పేరుపేరునా సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

Show comments