iDreamPost
android-app
ios-app

కరోనా రోగిని కాపాడేందుకు డాక్టర్ ఎంత సాహసం చేశాడో తెలుసా ?

కరోనా రోగిని కాపాడేందుకు డాక్టర్ ఎంత సాహసం చేశాడో తెలుసా ?

కరోనా వైరస్ సోకిన ఓ రోగిని కాపాడేందుకు ఓ డాక్టర్ చేసిన సాహసం చివరకు తననే క్వారంటైన్ సెంటర్ కు తరలేట్లు చేసింది. వైరస్ సోకిన పేషంటును కాపాడేందుకు డాక్టర్ తన ప్రాణాలను కూడా పణంగా పెట్టటం ఇపుడు సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీలోని ఎయిమ్స్ లోని ఓ ట్రామా సెంటర్ కు కరోనా వైరస్ సోకిన రోగిని తరలించే బాధ్యతను అధికారులు సీనియర్ డాక్టర్ జహీద్ అబ్దుల్ మజీద్ కు అప్పగించారు.

ఇందులో భాగంగానే డాక్టర్ రోగి ఉన్న ప్రాంతానికి వెళ్ళి అంబులెన్సులో పేషంట్ ను ఎక్కించుకుని తిరిగి ఎయిమ్స్ కు వస్తున్నాడు. అంబులెన్సులోకి ఎక్కించుకునేటప్పటికే రోగి పరిస్ధితి ఏమంత బావోలేదట. అదే సమయంలో అంబులెన్సు బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత పేషంట్ శ్వాసతీసుకోవటంలో బాగా ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్ గుర్తించాడు. అయితే ఏం చేయాలి అన్నది సిబ్బందిలో ఎవరికీ అర్ధం కాలేదు.

ఎందుకంటే అందరూ పర్సనల్ కిట్ ధరించుకున్నారు. మొహానికి గ్లాసులు, చేతులకు గ్లౌజులు, మొత్తం బాడీ సూట్ ధరించి ఉండటం వల్ల సిబ్బంది ఎవరూ ఏమి చేయలేకపోయారు. అసలు విషయం ఏమిటంటే ఆక్సిజన్ సిలిండర్ నుండి పేషంట్ గొంతులోకి దింపిన ఆక్సిజన్ ట్యూబ్ లూజైపోయింది. దాంతో పేషంటుకు ఆక్సిజన్ అందటం లేదు. ఇదే పద్దతిలో తీసుకెళితే ఆసుపత్రికి వెళ్ళేటప్పటికి పేషంట్ చనిపోవటం ఖాయమని అందరికీ అర్ధమైపోయింది.

దాంతో పరిస్ధితి విషమిస్తున్నట్లు గ్రహించిన సీనియర్ డాక్టర్ వెంటనే మొహానికి ఉన్న కళ్ళజోడు, రక్షణ కవచాలను కూడా వెంటనే తీసేశాడు. సిలిండర్ కున్న ట్యూబును సరిగా బిగించంతో పాటు పేషంట్ గొంతులోకి ట్యూబ్ ను జాగ్రత్తగా అమర్చి మళ్ళీ రోగి మొహానికి ఆక్సిజన్ మాస్కును అమర్చటంతో పేషంట్ పరిస్ధితి కాస్త నెమ్మదించింది. ఇంతలో ఆసుపత్రి కూడా రావటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇపుడు పరిస్ధితి ఎలాగుందంటే కరోనా రోగులున్న వార్డుల్లో డ్యూటీలు వేస్తున్న కారణంగా అసలు ఉద్యోగాలకే రాజీనామాలు చేస్తున్న డాక్టర్లను చూస్తున్నాం. క్వారంటైన్ కేంద్రాల్లో అన్నీ రక్షణ జాగ్రత్తలు తీసుకుని డ్యూటిలు చేస్తున్న వైద్య సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకుతున్న ఘటనలు మనకు తెలుసు. అలాంటిది ఓ వైరస్ రోగిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన డాక్టర్ మజీద్ ను అందరూ అభినందిస్తున్నారు. మొత్తానికి అభినందనలను అందుకుంటున్న డాక్టర్ ను కూడా అధికారులు ఎయిమ్స్ లోనే ఉంచిన క్వారంటైన్ కేంద్రానికి తరలించటమే కొసమెరుపు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి