ఢిల్లీలో మళ్లీ కేజ్రీవాల్, బైజాల్ మధ్య వివాదం

ఢిల్లీలో ముఖ్యమంత్రి వర్సెస్ లెప్టినెంట్ గవర్నర్ మధ్య ఎప్పుడూ వివాదమే. అరవింద్ కేజ్రివాల్ పై అనిల్ బైజాల్ ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయనపై ఎల్జీ కత్తి కట్టారు. ఎందుకంటే ఎల్జీ కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో నియామకం అయ్యారు. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉంది. దాన్ని ఇరుకున పెట్టేందుకు కేంద్రం పనులన్నీ ఎల్జీ చేస్తారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీసుకున్న కీలక నిర్ణయాలను ఎల్జీ అనిల్ బైజాల్ వ్యతిరేకిస్తున్నారు. అందుకే వీరిద్దరి మధ్య ఎప్పుడూ వార్ జరుగుతునే ఉంటుంది. ఆ మధ్య ఎల్జీ వైఖరిని నిరసిస్తూ ఏకంగా సిఎం కేజ్రివాల్ తన మంత్రి వర్గ సహచరులతో ఎల్జీ కార్యాలయంలో ధీక్షకు దిగాల్సి వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి వర్సెస్ ఎల్జీగా ఉంటుంది. అయితే ఇటివలి కొంత కాలంగా వారిద్దరి మధ్య ఎటువంటి వివాదం జరగలేదు. ఢిల్లీలో హింస, తరువాత కరోనా వైరస్ నేపథ్యంలో ఇద్దరూ సమన్వయంతోనే పనిచేశారు. కాని మళ్లీ ఇప్పుడు వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది.

ఆప్‌ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)ల మధ్య మరో వివాదం తలెత్తింది. రెండు రోజుల క్రితం ఆప్‌ ప్రభుత్వం ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఎల్జీ అనిల్‌ బైజాల్‌ తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలిచ్చారు.

ఢిల్లీలో ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఢిల్లీ వాసులైన కోవిడ్‌–19 రోగులకు మాత్రమే చికిత్స అందించాలని, కోవిడ్‌–19 లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు జరపాలని పేర్కొంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కారు జూన్ 6న ఆదేశాలిచ్చింది. రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

అయితే, ఈ ఆదేశాలను తోసిపుచ్చుతూ ‘’అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, నర్సింగ్‌ హోమ్స్‌ల్లో స్థానికుడా? స్థానికేతరుడా? అనే వివక్ష చూపకుండా అందరు కోవిడ్‌–19 పేషెంట్లకు చికిత్స అందించాలి’’ అని స్పష్టం చేస్తూ ఎల్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే, కరోనా లక్షణాలున్నవారికే పరీక్షలు జరపాలనడం ఐసిఎంఆర్‌ మార్గదర్శకాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తే..కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కష్టమవుతుందని, కరోనా మరింత ప్రబలుతుందన్నారు.

ఐసిఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు మొత్తం 9 కేటగిరీల వారికి పరీక్షలు జరపాల్సిందేనన్నారు. ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ హోదాలో ఎల్జీ అనిల్‌ బైజాల్‌ ఆ ఆదేశాలిచ్చారు. ఎల్జీ తీరుపై ఆప్‌ మండిపడింది. బిజెపి ఒత్తిడితోనే ఎల్జీ అలా వ్యవహరిస్తున్నారని, బిజెపి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించింది.

Show comments