కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి దేశమంతటా జనతా కర్ఫ్యూ విధించడానికంటే రెండు రోజుల ముందే కరోనా కలకలాన్ని ముందే అంచనా వేసిన టీటీడీ భక్తుల సంక్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులందరికి దర్శనాన్ని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా తీవ్రత అధారంగా గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లు గా విభజించి ఒక్క రెడ్జోన్ మినహా మిగతా జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో టీటీడీ లో దశలవారీగా మొదలయ్యాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల మేరకు విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ మాస్కులు తప్పనిసరి చేశామని టీటీడీ జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ తెలిపారు. నేటి నుండి పరిపాలనా భవనం ప్రవేశద్వారం వద్ద లోపలకి వచ్చే ప్రతి ఒక్కరికి థర్మోస్కానింగ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో ఉద్యోగులందరూ భౌతికదూరం పాటించేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులు ఒక చోట చేరేలా సమావేశాలు నిర్వహించకుండా డిజిటల్ సమావేశాలు వైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు.
టీటీడీ జేయీఓ బసంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత మార్గదర్శకాల మేరకు విభాగాధిపతులు, శాఖాధిపతులు అందరూ విధులకు హాజరవుతున్నారని చెప్పారు. ఆలయాల్లోని అర్చక, ఇతర సిబ్బంది, ట్రెజరీ, అకౌంట్స్, ఆరోగ్య విభాగం, భద్రత విభాగాల సిబ్బంది 100 శాతం హాజరవుతున్నారని ఆయన వివరించారు. ఇతర విభాగాల్లో అవసరాన్ని బట్టి 33 శాతం సిబ్బంది కార్యాలయాలకు హాజరవుతున్నారని, ఇతర సిబ్బంది ఇళ్ల వద్ద నుండే విధులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు.