iDreamPost
iDreamPost
శుక్రమహర్దశ అంటాం కదా. దానికిప్పుడు సంగీత దర్శకుడు తమన్ తప్ప ఇంకో అత్యుత్తమ ఉదాహరణ చెప్పడం కష్టం. అఖండ విజయంలో తన పాత్ర ఎంత కీలకంగా మారిందో సోషల్ మీడియాలో నెటిజెన్ల స్పందనను బట్టి అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తాను మాములుగా కష్టపడలేదని రిలీజ్ కు ముందు తమన్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమని ఋజువయ్యింది. సెకండ్ లాక్ డౌన్ కు ముందు వకీల్ సాబ్ టైంలోనూ ఇలాంటి రెస్పాన్నే దక్కించుకోవడం గుర్తు చేసుకోవాలి. అంత సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామాలో హీరోయిజం ఎలివేట్ అయ్యేలా తమన్ ఇచ్చిన బిజిఎమ్ కోసం ఫ్యాన్స్ ఎంతగా చెవులు కోసుకున్నారో ఈజీగా మర్చిపోయేది కాదు.
ఇంత భీభత్సమైన ఫామ్ తమన్ కు అల వైకుంఠపురములో నుంచి డబుల్ స్పీడ్ లో వెళ్తోంది. అందులో పాటలకు, నేపధ్య సంగీతానికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. డిజాస్టర్ సినిమా డిస్కో రాజాలోనూ తన మార్కు తమన్ చూపించగలిగాడంటే ఇదంతా తన పనితనమే. పవన్ కళ్యాణ్ కు రెండో సారి మ్యూజిక్ ఇస్తున్న భీమ్లా నాయక్ కు ఇతను ఇస్తున్న ట్యూన్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇంకా సర్కారు వారి పాట సాంగ్స్ బయటికి రాలేదు. అవి వచ్చాక రచ్చ ఇంకే స్థాయిలో ఉంటుందో. చిరంజీవి గాడ్ ఫాదర్ ఇస్తున్న పాటల మీద మెగాస్టార్ అభిమానులు అప్పుడే ఓ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకుంటున్నారు.
రామ్ చరణ్-శంకర్ కాంబో, మహేష్-త్రివిక్రమ్ ల సినిమాల వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాడు తమన్. మరోపక్క తమిళం నుంచి కూడా విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. విశాల్ ఎనిమి ఆశించిన స్థాయిలో గొప్పగా ఆడకపోయినా తమన్ పాటలు మాత్రం ఆడియన్స్ కి ఎక్కేశాయి. ఇవి రాకుండా ఇంకా ఫైనల్ కాకుండా డిస్కషన్ స్టేజిలో ఉన్నవి మరికొన్ని ఉన్నాయి. ఒకప్పుడు మణిశర్మ, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, కీరవాణిలు మాత్రమే ఈ రేంజ్ హైప్ ని ఎంజాయ్ చేశారు. తమన్ దెబ్బకే సమకాలీకుడైన దేవిశ్రీ ప్రసాద్ కూడా దూకుడు తగ్గించుకోవాల్సి వచ్చింది. దశ బాగున్నప్పుడు దానికి ప్రతిభ తోడైతే జరిగే అద్భుతాలు ఇలాగే ఉంటాయి
Also Read : RRR : రాజమౌళి బృందం ముందు కఠిన సవాళ్లు