రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే అధికార వికేంధ్రీకరణ ఒక్కటే మార్గమని, సెక్రటేరియట్ ని మూడు భాగాలుగా విభజించి అమరావతి, వైజాగ్, కర్నూల్ లో మినీ సెక్రటేరియట్ లను ఏర్పాటు చెయ్యాలని బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు ని కూడా 3 బెంచ్ లుగా విభజించి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చెయ్యాలని టిజి వెంకటేష్ సూచించారు
నిన్న విశాఖపట్టణంలోని వీజేఎఫ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న టిజి వెంకటేష్ మీడియానుద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేసవి మరియు శీతాకాల అసెంబ్లీ సమావేశాలని కర్నూల్, వైజాగ్ లో నిర్వహించాలని చంద్రబాబు కి సూచించిన మొదటి వ్యక్తిని తానేనని, అయితేనా వ్యాఖ్యలు ఆయన పెడచెవిన పెట్టారని, రాష్ట్ర విభజన తరువాత కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వింటర్, సమ్మర్ కేపిటల్స్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిని తానేనని టిజి వెంకటేష్ అన్నారు
Read Also: రాజధానిగా అమరావతిని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధం — రాష్ట్రపతికి వైసీపీ ఎమ్మెల్యే లేఖ
రాయలసీమ ప్రాంతం నుంచి ప్రధాని, రాష్ట్రపతి తో పాటు అనేకమంది ముఖ్యమంత్రులయినా.. రాయలసీమలో ఇంటికో నాయకుడు వున్నా.. ఇంకా తమ ప్రాంతం వెనుకబడే వుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదికల పేరుతో కమిటీలను ఏర్పాటుచేసి గతంలో పోరాటాలు కూడా చేశామని, అదృష్టవశాత్తూ జగన్ ఈ విశాఖ పట్టణం ప్రాంతానికి కార్యనిర్వాహక రాజధానిని కేటాయించడం అభినందనీయమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు మంచి మనసు కలిగిన మెతక వ్యక్తులని టిజి వెంకటేష్ కొనియాడారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై దృష్టిసారించి ఇక్కడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
గతంలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుండే రావడంతో ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమవాసులకే ముఖ్యమంత్రి పీఠం దక్కిందని, ఉమ్మడి రాష్ట్రంగా కలిసుంటే తెలంగాణకు ఎప్పటికీ ముఖ్యమంత్రి పదవి రాదన్న ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. భవిష్యత్తులో అటువంటి ఉద్యమాలు రాకుండా రాయలసీమను అభివృద్ధి పర్చాలని కోరుకుంటున్నానని, రాజధాని కాబట్టే గతంలో మద్రాస్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టారని, రాజధాని ఎక్కడుంటే అక్కడ పెట్టుబడులు పెరిగి అభివృద్ధి బాగా జరిగిందని, కనుక ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై వుందని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.
వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలను తాత్కాలికమైనవని చెప్పడం చంద్రబాబు చేసిన తప్పిదంగా టిజి వెంకటేష్ విశ్లేషించారు. కర్నూలులో రాజధాని గా ఏర్పాటు చేయడానికి అనుగుణంగా సుమారు 30 వేల ఎకరాలు అందుబాటులో ఉందన్నారు. భవనాల నిర్మాణానికి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరముండదన్నారు.
మూడు ప్రాంతాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు తిరగడం వల్ల ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుందని దీనివల్ల ప్రయాణం, వ్యయప్రయాసలు పెరుగుతాయనే వాదనని టిజి తోసిపుచ్చారు. కర్నూలు, వైజాగ్‌లో రాజధాని పెడితే విపత్తులు వచ్చినప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న కొంతమంది మాటల్లో అర్థం లేదన్నారు. అయితే అమరావతిలో రాజధాని వుండబోదని ప్రభుత్వం ఎక్కడా చెప్పడం లేదని, కాకపొతే మిగిలిన ప్రాంతాలకి కూడా రాజధాని ని విస్తరిస్తామంటున్నారని మాత్రమే అంటున్నారని కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని టిజి కోరారు.