iDreamPost
iDreamPost
కరోనా వల్ల షూటింగులు ఆగిపోయి థియేటర్లు మూతబడి తీవ్ర సంక్షోభంలో ఉన్న సినీ పరిశ్రమకు ఇప్పుడు ఓటిటి రూపంలో కొత్త సెగలు మొదలయ్యాయి. సూర్య నిర్మాణంలో భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో రూపొందిన పోన్మగళ్ వన్తాళ్ ని మే మొదటి వారంలో ప్రైమ్ ద్వారా నేరుగా డిజిటల్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఇకపై సూర్య సినిమాలు విడుదల కానివ్వబోమని తీర్మానించి ఆ మేరకు ప్రకటన చేయడం ఇప్పటికే కలకలం రేపుతోంది. తాము కలిసి మాట్లాడినా కూడా నిర్మాతలు వినలేదని అసలు తమ వినతిని పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సూర్య స్వంత బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్ సినిమాలు మాత్రమే అడ్డుకుంటారా లేక ఆ హీరో నటించిన ప్రతి మూవీని ఆపేస్తారా అనే క్లారిటీ ఇంకా రాలేదు. మరోవైపు బాలీవుడ్ లోనూ ఇలాంటి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో కాంచన రీమేక్ గా రూపొందిన ‘లక్స్మీ బాంబ్’ కూడా డిజిటల్ లోనే వస్తుందనే ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే జరిగితే స్టార్ హీరో సినిమా ఇలా ఓటిటిలో వచ్చిన మొదటి మూవీ చరిత్రలో నిలిచిపోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సరే మన దగ్గర ఇలాంటిదేమీ లేదు కదాని అనుకోవడానికి లేదు. చిన్న సినిమా అమృతారామం 29న టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇంకొందరు ఇదే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు ఉన్నాయి.
లాక్ డౌన్ ను మే 5 తర్వాత విడతల వారిగా ఎత్తేసే అవకాశం ఉంది. మినహాయింపులో థియేటర్లు ఉండే ఛాన్స్ తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇలా ఒక్కొక్కరుగా డిజిటల్ వైపు మొగ్గు చూపితే పంపిణీదారుల స్పందన ఏ విధంగా ఉండబోతోందన్నది అర్థం కావడం లేదు. మొత్తానికి ఓటిటి వివిధ మార్గాల్లో ప్రభావం చూపించడం మొదలైంది. కేరళ, కర్ణాటకలోనూ ఇదే తరహా చర్చలు జోరుగా సాగుతున్నాయి. జూన్ కంతా పరిస్థితి సద్దుమణిగిందా సరే లేదంటే పరిశ్రమలో పరిణామాలు మరింత తీవ్రంగా ఉండటం ఖాయం. ప్రేక్షకుల్లోనూ ఇవి ఎక్కడికి దారి తీస్తుందన్న ఆసక్తి నెలకొంది.