iDreamPost
android-app
ios-app

పులివేషాల దస‌రాబుల్లోడు

పులివేషాల దస‌రాబుల్లోడు

ఇప్పుడైతే డిజిటల్ మీడియా వ‌చ్చి సినిమా ప్ర‌చారం మారిపోయింది గానీ, ఒక‌ప్పుడు అంతా నాటు, మోటు ప‌ద్ధ‌తులే. త‌ర్వాతి త‌రాల వాళ్లు న‌మ్మ‌లేనంత ఆశ్చ‌ర్యంగా ప్ర‌మోష‌న్ ఉండేది.

తొలిరోజుల్లో జ‌నాల‌ను థియేట‌ర్‌కి ర‌ప్పించ‌డం అంత ఈజీ కాదు. కొత్త సినిమా వ‌చ్చింద‌ని, వాళ్ల‌కి తెలియ‌జేయ‌డ‌మే చాలా క‌ష్ట‌మైన ప‌ని. 1950కి ముందు ఊరంతా పోస్ట‌ర్ల‌ని ఊరేగించ‌డ‌మే కాకుండా, ఆ సినిమాలోని దృశ్యాల‌ని వీధినాట‌కాలుగా ప్ర‌ద‌ర్శించేవాళ్లు. భాగ్య‌రేఖ‌లో రేలంగి ప‌బ్లిసిటీ మేనేజ‌ర్‌గా ఉండి వీధుల్లో నాట్యం చేయిస్తూ ఉంటాడు. అప్ప‌టికి సినిమా ప్ర‌చారాన్ని 1957లో వ‌చ్చిన ఈ సినిమాలో చూడొచ్చు. త‌ర్వాత హీరోయిన్‌గా మారిన EV స‌రోజ ఈ సినిమాలో చిన్న డ్యాన్స‌ర్‌.

నాకు ఊహ వ‌చ్చేస‌రికి , మా ఊరు రాయ‌దుర్గంలో రెండు థియేట‌ర్లు ఉండేవి. ప్ర‌తిరోజూ సాయంత్రం ఒంటెద్దు బండికి పోస్ట‌ర్లు అతికించుకుని , డ‌ప్పులు కొడుతూ ఊరంతా తిరుగుతూ ప్ర‌చారం చేసేవాళ్లు. ఒకాయ‌న మైకులో ఆ సినిమా గొప్ప‌ద‌నం గురించి వ‌ర్ణించేవాడు. ఒక కుర్రాడు పాంప్లేట్స్ పంచేవాడు. దాంట్లో ఆ సినిమా క‌థ‌ని కొంచెం వివ‌రించి “రాధా, గోపి క‌లుసుకున్నారా లేదా?” అని ఒక క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ఇచ్చి, ఆన్స‌ర్‌ని వెండ‌తీర మీద చూడ‌మ‌నేవాళ్లు.

ద‌స‌రాబుల్లోడు సినిమా వ‌చ్చిన‌ప్పుడు పులివేషాలు, బ్యాండ్ బాజాల‌తో ఊరు మోతెక్కిపోయింది. ఆ రోజుల్లో హౌస్‌ఫుల్ అనే ప‌దం లేదు. రైల్లో జ‌న‌ర‌ల్ బోగీ టికెట్లు ఇచ్చిన‌ట్టు ఇచ్చేవాళ్లు. సీటు కోసం యుద్ధాలు జ‌రిగేవి. ఎక్స‌ట్రా బెంచీలు వేసేవాళ్లు. కొంద‌రు నిల‌బ‌డి కూడా చూసేవాళ్లు. ప్రేక్ష‌కుల కాళ్లు తొక్కుతూ సోడాల వాళ్లు కుయ్యికుయ్యిమ‌ని సౌండ్ ఇచ్చేవాళ్లు. జ‌నం వేసే విజిల్స్‌కి ఇది అద‌న‌పు DTS.

ఊర్లో కొన్ని సెంట‌ర్లు ఉండేవి. అక్క‌డ పెద్ద‌పెద్ద పోస్ట‌ర్లు అతికించేవాళ్లు. ANR అభిమానులు NTR పోస్ట‌ర్ల‌కి ,NTR అభిమానులు ANR పోస్ట‌ర్ల‌కి ప‌ర‌స్ప‌రం పేడ ముద్ద‌లు విసురుకునేవాళ్లు. అన్నిటికంటే ఆక‌ర్ష‌ణ ఏమంటే సినిమా పాట‌ల పుస్త‌కాలు థియేట‌ర్ ద‌గ్గ‌ర దొరికేవి. ఆ రంగుల పుస్త‌కాల‌ను కొని దాచుకోవ‌డం అదో స‌ర‌దా.

షావుకార్లు మాత్రమే వాచీలు పెట్టుకునే కాలం కాబ‌ట్టి, సినిమా థియేట‌ర్ ముందు మైక్ పెద్ద గొంతుతో న‌మోవెంక‌టేశాయః అని అరుస్తూ పిలిచేది. అది ఆగిందంటే సినిమా స్టార్ట్ అవుతుంద‌ని అర్థం.

థియేట‌ర్ అంటే అదొక భ‌వ‌నం కాదు. మ‌నుషుల జీవితం. అక్క‌డ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేవాళ్లు, ఏడ్చేవాళ్లు, శాప‌నార్థాలు పెట్టేవాళ్లు, ఆనందం ప‌ట్ట‌లేక డ్యాన్సులు చేసేవాళ్లు.

ఇప్పుడు సినిమా బిగుసుకుపోయింది. ఎమోష‌న్స్ లేవు. శ‌న‌క్కాయ‌లు అమ్మేవాళ్లు లేరు. సోడాలు కొట్టేవాళ్లు లేరు. మ‌నుషుల‌తో సంబంధం లేని క‌థ‌లు నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌డుస్తున్నాయి.