iDreamPost
android-app
ios-app

ఉత్తరాంధ్ర అంటే అచ్చెన్నాయుడు ఒక్కడేనా…ఆయనెప్పుడు బిసి నాయకుడయ్యాడు?

ఉత్తరాంధ్ర అంటే అచ్చెన్నాయుడు ఒక్కడేనా…ఆయనెప్పుడు బిసి నాయకుడయ్యాడు?

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు అరెస్టుతో టీడీపీ మరియు దాని అనుకూల మీడియా గగ్గోలు పెడుతుంది. కంభకోణం చేసినా పర్వాలేదు కాని అరెస్టు చేయకూడదు. కోట్ల రూపాయిలు దోచుకున్నందుకు అరెస్టు చేయడం కూడా పాపం అయిపోయింది.

టిడిపి హయాంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలోనే ESI కుంభకోణం జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. మంత్రి చొరవతోనే డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో రూ.150 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి.

అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.293 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. దీనిపై ఎసిబి లోతైన విచారణ జరుపుతోంది.

ఇదిలా ఉండగా ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడును పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. అవినీతి చేసిన వాడిని పట్టుకోవడమే కదా పారదర్శకత అంటే..కాని రాష్ట్రంలో అవినీతి చేసిన వాడిని అరెస్టు చేస్తే…అదేదో తప్పు అన్నట్టు ఎల్లో మీడియా వ్యవహరిస్తుంది.

కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేస్తే…టీడీపీ మరియు దానికనుకూల మీడియా దాన్ని ఉత్తరాంధ్రకు జరిగిన అవమానంలాగా…బిసిలకు జరిగిన అన్యాయంలాగా చిత్రీకరిస్తుంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. అలాంటి వారిని వెనకేసుకు వస్తున్న ఎల్లో మీడియా గతాన్ని మరిచి…దాన్ని ఉత్తరాంధ్ర ప్రజలకు, బిసిలకు పులిమేందుకు చూస్తుంది. ఆ రకంగా ప్రచారం చేస్తుంది.

ఉత్తరాంధ్ర అంటే అచ్చెన్నాయుడు ఒక్కడేనా.. ఆయన మాత్రమే బిసి నాయకుడా ..? గత ప్రభుత్వాల హయంలో సంఘటనలు జరిగితే ఉత్తరాంధ్ర గుర్తుకురాలేదా..?

వొక్స్ వ్యాగన్ వ్యవహారంలో బిసి నేత బొత్స సత్యనారాయణపై టీడీపీ చేసిన దాడి,అనుకూల మీడియా రాసిన రాతలు ప్రజలు మర్చిపోరు.ఒక కుంభకోణాన్ని ముందస్తుగా పసిగట్టి కోట్ల రూపాయలు నష్టం పోకుండా నాటి వైయస్ఆర్ ప్రభుత్వం జాగ్రత్తపడింది. అప్పుడు “సొమ్ములు పోనాయి ఏటి చేస్తాం” అని విజయనగరం యాసలో మాట్లాడిన మాటలను దారుణంగా ట్రోల్ చేశారు. నాడు ఉత్తరాంధ్ర ,బీసీ నేత అన్న సృహ ఈ టీడీపీ నేతలకు లేకుండాపోయింది. అచ్చెన్నాయుడు అన్న చాటున ఎదిగిన నేత అయితే బొత్సా స్వయంగా ఎదిగిన నేత ,తనతో పాటు అనేక మందిని ఎమ్మెల్యేలుగా ,ఎంపీలుగా గెలిపించుకున్న బీసీ నేత,ఆయన విషయంలో లేని ఉత్తరాంధ్ర మరియు బీసీ సెంటిమెంట్ ఇప్పుడెందుకు వచ్చాయి?

అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో రెచ్చగొట్టి బొత్స ఇంటిపై రాళ్ళు వేయించారు. సమైక్యాంద్ర ఉద్యమంలో గుంటూరు,విజయవాడలో కూడా జరగనంత ఆందోళనలు, దాడులు విజయనగరంలో జరిగాయి. బొత్సనే ఆంధ్రను విడగొట్టినట్టు ,ఆయన ఆస్తులపై దాడి చేయించారు. కాని రాష్ట్ర విభజనకు మద్ధతు ఇచ్చి ,రెండు కళ్లు సిద్ధాంతంతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబును వదిలేశారు. బొత్స ఇంటిపై రాళ్ళు వేయించినప్పుడు ఉత్తరాంధ్ర, బిసి సెంటిమెంట్ ఏమైంది..? ఈ రోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. బిసి సెంటిమెంట్ ను తీసుకొచ్చి…బిసిలను రెచ్చగొడుతున్నారు. 

2018లో ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఉత్తరాంధ్ర వాళ్లకు ఏమీ రాదన్నప్పుడు ఎక్కడికెళ్లిందీ ఈ ఎల్లో మీడియా..?

ఉద్యమాలకు నిలయమైన శ్రీకాకుళం భాష, యాసపై ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ వ్యగ్యంగా మాట్లాడటంపై నాడు మేథావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు రచయితలు ఆందోళన చేశారు‌ కదా మరిచితిరా..?

‘’పొట్టచింపితే అక్షరం కాదు..హిందీ అక్షరం రాని ఉత్తరాంధ్ర’’ అని టిడిపి ఎంపి రామ్మోహన్‌ నాయుడు ఎదుటనే వేమూరు రాధాకృష్ణ అవహేళన చేసినా రామ్మోహన్ నాయుడు ఖండించలేదు. ఉత్తరాంధ్రలో ఉన్న ఏ టిడిపి నేత కూడా ఖండించలేదు. ఎందుకంటే టిడిపిలో ఉన్న ఏ కులం నేతైనా కమ్మ వాళ్లను విమర్శించరు.

ఇంత కాలం బిసి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు బిసిలకు ఏం చేశాడు..? బిసిలు టిడిపి జెండాలు మోసి భుజాలు అరిగిపోయినా.. బిసిలకు చేసిందేమీ లేదు. ఇప్పుడు బిసిలు వైసీపి వైపు మళ్లారు. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున బిసిలు వైసిపికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. టిడిపికి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో చంద్రబాబు పార్టీకి బిసిలు‌ చుక్కలు చూపించారు.
ఉత్తారాంధ్రలో ఎవరికి మద్దతు ఉందో మొన్నటి ఎన్నికలో ప్రజలు తమ ఓటుతో తీర్పు చెప్పారు.. విజయనగరంలో ఒక్క సీటు కూడా సాధించలేక పోయిన టీడీపీ శ్రీకాకుళంలో మాత్రం రెండు సీట్లు సాధించి పరువు నిలుపుకుంది…

అందుకు ప్రతిఫలంగా జగన్ సిఎం అయిన ఏడాదిలోనే గతంలో ఎన్నడూ జరగనట్లు బిసిలకు న్యాయం జరిగింది. అందువల్ల బిసిలంతా ప్రస్తుతం వైసిపితో ఉన్నారు. కనుకనే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయి..బిసి ఓటు‌ బ్యాంక్ చేజారిపోతుందని భయం పట్టుకుంది. ఎలాగైనా వైసిపి ‌నుంచి బిసిలను వేరుచేయాలని చంద్రబాబు, ఆయన స్వరాన్ని వినిపిస్తున్న ఎల్లో మీడియా ‌అచ్చెన్నాయుడు అరెస్టును బిసిలకు జరిగిన అన్యాయంగా చిత్రీకరిస్తుంది. అందుకే ఉన్నఫలంగా బిసి జపం చేస్తుంది. అంతేతప్ప చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు బిసిల‌ మీద ప్రేమేమీ లేదు.

ఇదికదా ఉత్తరాంధ్రకు జరిగిన అవమానం, బిసిలకు జరిగిన అన్యాయం. దాన్ని మరిచిపోయి ఇప్పడు తప్పు చేసిన అచ్చెన్నాయుడును అరెస్టు‌ చేస్తే ఉత్తరాంధ్ర, బిసి జపం సెంటిమెంట్ ను‌ రెచ్చగొడుతున్నారు. అయితే చంద్రబాబు, ఎల్లో మీడియా ఎన్ని కుతంత్రాలకు వడిగట్టినా ఉత్తరాంధ్ర ప్రజలు, బిసిలు వారి మాట నమ్మరు..!