Idream media
Idream media
విశ్వవిద్యాలయాలను తమ సొంత రాజకీయాల కోసం వాడుకోవడం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచే అలవాటు. సామాజిక వర్గాల వారీగా విద్యార్థుల విడగొట్టి పబ్బం గడుపు కోవడం ఆ పార్టీకి వెన్నతోపెట్టిన విద్య. తాజాగా అమరావతి పేరుతో చేస్తున్న నిరసనలకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీని పావుగా వాడుకోవాలని తెలుగుదేశం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు గుర్తించాయి. దీన్ని అడ్డుకోవడానికి ఎస్టీఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్, ఎన్‌డీఎస్‌ఎఫ్, వైఎస్సార్‌సీపీ సీయూ తదితర విద్యార్థి సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేస్తున్న బయటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రోశయ్య, పెద్దకాకాని, మంగళగిరి సీఐలకు జేఏసీ నాయకులు వినతి పత్రాలు ఇచ్చారు. వెంటనే దీక్ష శిబిరాన్ని తొలగించాలని కోరారు. వర్సిటీలో బయటి వ్యక్తుల కార్యకలాపాలు పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఇటీవల టీడీపీ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, మన్నవ సుబ్బారావు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తదితరులు వర్సిటీ వద్దకు వచ్చి వైస్ చాన్సలర్ రాజశేఖర్‌ను వాడు వీడు అంటూ దూషించారని తెలిపారు. ఇలాంటి విషయాలను ఇకపై ఎంత మాత్రం సహించబోమని తేల్చిచెప్పారు. వెంటనే దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయడంతోపాటు వీసీకి టీడీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే ఉద్యమం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిని వదిలేది లేదన్నారు.