Idream media
Idream media
వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి విజయవంతమైన రాజకీయ నేతగా మారారు. ప్రత్యర్థులపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ… ఓ పక్క పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యర్థి మీడియాను చీల్చి చెండాడే సోషల్ మీడియా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సాగుతున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, రాజకీయ విధానాలను ఎప్పటికప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఎండగట్టింది. ఈ క్రమంలో కేసులు ఎదుర్కొన్న వారికి విజయసాయిరెడ్డి అండగా ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టు నుంచి నోటీసులందుకున్న వారికి కూడా తానున్నానే భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో ఆయన్ను జగన్‌కు దూరం చేయాలనే కుట్రకు ప్రత్యర్థులు తెరతీసినట్లు తెలుస్తోంది. ఇటీవల పలు మీడియా ఛానెళ్లు జగన్‌కు, విజయసాయి రెడ్డికి మధ్య దూరం పెరిగిందనే గాసిప్ వార్తలు ప్రచారం చేశాయి. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా అదే పాట అందుకున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జగన్, విజయసాయి రెడ్డిల మధ్య గ్యాప్ వచ్చిందన్నారు. ఏబీఎన్, టీవీ 5 చేసిందంటే ఒక అర్థం ఉంది.. ఎన్‌టీవీ కూడా అదే వార్తను ప్రచారం చేసిందని నిన్న జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. తనకు వైఎస్ కుటుంబంతో ఉన్న సన్నిహిత్యం గురించి చెబుతూ.. తాను మరణించే వరకూ జగన్ పక్కనే ఉంటానని ఆ కథనానికి కౌంటర్ ఇచ్చారు. దీన్ని పట్టుకుని బుద్ధా వెంకటన్న.. ‘‘అదిగో.. విజయసాయిరెడ్డికి జగన్‌కు గ్యాప్ వచ్చింది. కాబట్టే.. జగన్ విజయసాయిరెడ్డిని పక్కనపెట్టాశారు. కాబట్టే.. చచ్చే వరకూ పార్టీలోనే ఉంటానని అన్నారు’’ అంటూ రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు.
తోడ కొట్టి సవాళ్లు చేసే బుద్ధా వెంకన్న ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. జగన్‌కు, విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ వస్తే.. తమకు వచ్చే లాభం ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వ పాలనలో లోపాలు, పథకాల అమలులో ఇబ్బందులు.. తదితర ప్రజలకు సంబంధించిన విషయాలపై ఫోకస్ పెడితే ప్రతిపక్ష పార్టీలు మళ్లీ ప్రజల మనసులను చూరగొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. వారిద్దరికీ పడడంలేదు.. వీరిద్దరికీ కుదరడంలేదనే విమర్శల వల్ల సమయం వృథా తప్ప వచ్చేది శూన్యమే.
టీడీపీ ప్రభుత్వ హాయంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నిత్యం ప్రజల్లో ఉన్నారు. తనపై అధికార పార్టీ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నా.. అవమానకరంగా మాట్లాడుతున్నా.. ఆయన ఎక్కడా వాటి జోలికి పోలేదు. కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేదు. తన లక్ష్యం.. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై ప్రజల తరఫున ప్రశ్నించడం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీయడం వరకే పరిమితమయ్యారు. ప్రజా సమస్యలపై ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు. ప్రజలకు కష్టం వచ్చిందంటే అక్కడ వాలిపోయారు. అందుకే ఏపీ ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. 151 సీట్లు ఇచ్చారు.
ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీగా ఎలా ఉండాలో, ఎలాంటి పాత్ర పోషించాలో వైఎస్ జగన్ రూపంలో ఓ పెద్ద కేస్ స్టడీ పుస్తకం రూపంలో ఉంది. ప్రతిపక్ష నేతగా జగన్.. అనే పుస్తకాన్ని ఫాలో అయితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్ల కన్నా కొంచెం మెరుగైన సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ అధ్యక్షుడి కుమారుడు గెలిచే ఛాన్స్ ఉంటుంది. ప్రజా సమస్యలను, వారి ఇబ్బందులను వదిలి.. ఇలా ఫలితంలేని వాటిపై సమయం పెడితే మిగిలేది బూడిదే. పైగా ప్రభుత్వం బాగా పని చేస్తుంది కాబట్టే.. విమర్శించేందుకు ఏమీ లేక టీడీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలు అనుకునే ఛాన్స్ పుష్కలంగా ఉంది.